Bhadradri District: కేంద్రానికి లేఖ రాస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రకంపనలు..?
ABN, First Publish Date - 2023-03-11T12:12:42+05:30
తెలంగాణలో పోడు రైతులకు పట్టాల అంశం మరోసారి పెద్ద సమస్యగా మారుతోంది. పోడు రైతుల పట్టాల వ్యవహారం అంటేనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు...
టీ.సర్కార్ ప్రకటనతో పోడు రగడకు ఎండ్ కార్డ్ పడ్డట్టేనా?.. సాగులో ఉన్న పోడు రైతులందరికీ పట్టాలు దక్కినట్టేనా?.. భూమినే నమ్ముకున్న అడవి బిడ్డలు.. ఇకపై ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకోవచ్చా?.. కేంద్రానికి లేఖ రాస్తామన్న కేసీఆర్ ప్రకటన మాత్రం.. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కంగారు పుట్టిస్తోందా?.. మరో తలపోటు తప్పదని ఆందోళన చెందుతున్నారా?.. ఇంతకీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు కంగారు పడుతున్నారు?.. అంతా ఒకే అని.. మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తామనడంలో ఆంతర్యమేంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిక
తెలంగాణలో పోడు రైతులకు పట్టాల అంశం మరోసారి పెద్ద సమస్యగా మారుతోంది. పోడు రైతుల పట్టాల వ్యవహారం అంటేనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. పోడు రైతులకు మద్దతుగా కేసీఆర్ సర్కార్‌పై దుమ్మెత్తి పోసారు. పోడు రైతులను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికార బీఆర్ఎస్ పార్టీని కాదని వారికి ఓట్లేసి గెలిపించారు. పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, అశ్వరావుపేటలో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర్‌రావు గెలుపొందారు. అయితే.. గెలిచిన తర్వాత అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి పనులు దక్కుతాయని.. పోడు రైతులకు పట్టాలు వస్తాయని చెప్పి కారెక్కారు.
ఎమ్మెల్యేలకు గుదిబండగా పోడు రగడ
అంతరవకూ భాగానే ఉన్నా.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలకు పోడు రగడ గుదిబండగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే పోడు రైతులకు పట్టాలు ఇస్తామని ప్రకటనలు చేయడం తప్ప.. ఇచ్చిన దాఖలు మాత్రం లేకుండా పోయాయి. పైగా.. హరితహారం పేరుతో పోడు సాగు భూముల్లో ఫారెస్ట్ సిబ్బంది పంటలు ధ్వంసం చేయడం, పోడు రైతులపై కేసులు నమోదు చేయడం, ఆదివాసుల గుడిసెలు కూల్చివేయడం జరుగుతోంది. ఆదివాసులు, ఫారెస్ట్ సిబ్బంది.. దాడులు, ప్రతిదాడులతో పోడు సమస్య నిత్యం రావణకాష్టంలా రగులుతోంది. ఇక.. పోడు రైతులకు పట్టాలు ఇస్తామంటూ సాగులో ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. భద్రాద్రి జిల్లాలో 86 వేల మంది దరఖాస్తులు చేరుకున్నారు. 2 లక్షల 99 వేల ఎకరాల్లో పోడు సాగు ఉండగా.. లక్షా 35 వేల ఎకరాలకు మాత్రమే పట్టాలు పంపిణీకి సిద్ధం చేశారు. దరఖాస్తు చేసినవారిలో 45 వేల మంది పట్టాలు పొందేందుకు అర్హత సాధించినట్లు తేల్చారు. 35 వేల మంది పోడు రైతులకు పట్టాలు పొందే అర్హత లేదని భద్రాద్రి జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ఆందోళన
పట్టాలు పొందేందుకు అర్హత సాధించనివారిని గిరిజనేతరులుగా గుర్తించారు. పోడు సాగు చేసుకుంటున్నవారు గిరిజనేతర రైతులు కావడంతో మరో ప్రధాన సమస్య వచ్చి పడింది. భద్రాద్రి జిల్లాలో సుమారు 25 వేలమంది గిరిజనేతర రైతులు ఎంతోకాలంగా పోడు సాగులో ఉన్నారు. గిరిజనేతర రైతులకు పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ.. వారి హక్కుల కోసం కేంద్రానికి లేఖ రాస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఎన్నికల వేళ పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వకుండా.. కొంతమందికే ఇచ్చి గిరిజనేతర రైతులకు ఇవ్వకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. కేసీఅర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా పోడు రైతుల సమస్యను రావణకాష్టంలా మార్చి, తీరా ఎన్నికల ముందు.. సాగులో ఉన్న సగం మంది పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోతే ఎదురుదెబ్బ తప్పదని మదనపడుతున్నారు. ఒకపక్క పోడు రైతుల కోసం కేసీఆర్ దగ్గర గట్టిగా అడగలేక.. మరోపక్క వారికి సమాధానం చెప్పలేక ఇరకాటంలో పడుతున్నారు .
2005కు ముందే సాగులో ఉన్న గిరిజనేతరులు
ఇక.. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ఆదివాసీ, గిరిజనేతర రైతు సంఘాలు మండిపడుతున్నాయి. అడవినే నమ్ముకున్న పోడు రైతులకు ఆంక్షల పేరుతో అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. 2005 కంటే ముందు సాగులో ఉన్న గిరిజనేతర పోడు రైతులకు పట్టాలు ఇవ్వొచ్చని.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం.. కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి.. కేంద్రానికి లింకు పెట్టాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలకు పోడు రగడ.. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతోపాటు నేతలను పోడు సమస్య కార్చిచ్చులా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నాటికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
Updated Date - 2023-03-11T12:13:33+05:30 IST