Dalit: ఆ ఊరిలో దళిత వ్యక్తులు చనిపోతే ఇతర కులస్థులు చేసే పనిది.. చాలా దశాబ్దాలు ఇదే తంతు..
ABN, First Publish Date - 2023-02-13T22:42:06+05:30
డిజిటల్ యుగంలో బతుకుతున్నా సమాజంలో దళితుల (Dalits) పట్ల వివక్షపూరిత, చులకన భావాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో మూలన వారిపై అన్యాయంగా దాడులు, మహిళలపై అత్యాచారాలు, ఊరేగింపులపై ఆంక్షలు, అడ్డగింతలకు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉంటాయి...
తూత్తుకుడి, తమిళనాడు: డిజిటల్ యుగంలో బతుకుతున్నా సమాజంలో దళితుల (Dalits) పట్ల వివక్షపూరిత, చులకన భావాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో మూలన వారిపై అన్యాయంగా దాడులు, మహిళలపై అత్యాచారాలు, ఊరేగింపులపై ఆంక్షలు, అడ్డగింతలకు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉంటాయి. ఇదే కోవకు చెందిన మరో ఘటన ఇటివల వెలుగుచూసింది. చనిపోయింది దళిత వ్యక్తనే ఒకే ఒక్క కారణంగా ఊరిలోని ప్రధాన మార్గం గుండా శవయాత్రకు అనుమతించని అమానవీయ ఘటన తమిళనాడులోని (Tamilnadu) తూత్తుకుడి జిల్లాలో వెలుగుచూసింది.
తూత్తుకుడి జిల్లా నడువకురి గ్రామంలో పల్లార్ కులానికి (షెడ్యూల్డ్ కులం) చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరి 11న చనిపోయాడు. కుటుంబ సభ్యులు అదే రోజు శవయాత్ర చేపట్టగా ఊరిలోని ప్రధాన రోడ్డు గుండా వెళ్లకుండా నడార్ కులానికి (OBC) (Nadar community) వ్యక్తులు అడ్డుపడ్డారు. దళితుల శవయాత్రకు అనుమతిచ్చేది లేదంటూ రోడ్డు బ్లాక్ చేశారు. అనుమతించాలంటూ ఎంతవారించినా లెక్కచేయలేదు. పబ్లిక్ రోడ్డే అయినప్పటికీ ఇటు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎంతకీ కనికరించకపోవడంతో వరి పొలాలు మధ్యగుండా కుటుంబ సభ్యులు స్మశానవాటికకు చేరుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు. మన్నర్కరవాయ్ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ వివక్షపూరిత ఘటన అక్కడివారికి కొత్తమీ కాదు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయని, దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతోందని గ్రామస్థులు నిట్టూర్చుతున్నారు.
ఈ ప్రాంతంలో ఈ తరహా వివక్ష కొత్తేమీ కాదని, చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని టీ షణ్ముగం అనే స్థానిక ఉద్యమకారుడు, పీహెచ్‌డీ స్కాలర్ చెప్పాడు. నాలుగు గ్రామాల దళిత వ్యక్తులు శవయాత్ర చేయాలంటే ప్రధాన రోడ్డుకు బదులు వరి పొలాల మధ్యగుండా వెళ్లాల్సి వస్తోందని వివరించాడు. ఈ సందర్భంగా 2018లో తనకు ఎదురైన అనుభవాన్ని షణ్ముగం పంచుకున్నాడు. ‘‘మా నాన్న చనిపోయినప్పుడు మెయిన్ రోడ్డు గుండా శవయాత్ర చేపట్టేందుకు నేను చాలా ప్రయత్నించాను. తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాను. శవయాత్రకు అనుమతించకపోతే శవాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తామని హెచ్చరించాను. ఎట్టకేలకు అడ్డుతప్పుకోవడంతో ప్రధాన రోడ్డుగుండా వెళ్లాము. అయితే ఇలా జరగడం చాలా అరుదు. మా నాన్న కేంద్రప్రభుత్వ మాజీ ఉద్యోగి. మా కుటుంబానికి ఊరిలో మంచి గౌరవం ఉంది. అయినప్పటికీ వివక్ష విషయంలో ఎలాంటి మార్పులేదు. నడార్స్ కులస్థులకు మారవార్స్(maravars) వంత పాడుతుంటారు’’ అని షణ్మగం వాపోయాడు.
నిరసన తెలిపినందుకు తనపై కేసు పెట్టేందుకు నడార్స్ కులస్థులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని గుర్తుచేసుకున్నాడు. రెండుమూడేళ్లక్రితమైతే వరి పొలాల్లో కాలువల వెంబడి బ్రిడ్జీలు కూడా ఉండేవి కావని, అరటి కాండాలను కాలువలు దాటాల్చి వచ్చేదని, శవాలను నీళ్లలో ఈడ్చుకెళ్లాల్సి వచ్చేదని షణ్మగం చెప్పాడు. ఇక ఇదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అభిరామీ అనే దళిత వ్యక్తి స్పందిస్తూ.. ఇతర కులస్థులు పాత విధానాలే ఇంకా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పాడు. షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్‌కు లేఖలు రాసినా ఏమీ మారలేదని నైరాశ్యం వ్యక్తం చేశాడు. ఈ ఉదంతంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం సాంకేతిక యుగంలో పరుగులు తీస్తుంటే ఇలాంటి వివక్షలు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2023-02-13T22:42:16+05:30 IST