Manipur: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్‌లో హిందీ చిత్రం ప్రదర్శన
ABN, First Publish Date - 2023-08-15T14:59:17+05:30
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని హెచ్ఎస్‌ఏ(HSA) సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా మణిపూర్‌లో బహిరంగంగా ప్రదర్శించిన చివరి హిందీ చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' అని హెచ్‌ఎస్‌ఏ తెలిపింది. ఈ చిత్రాన్ని 1998లో ప్రదర్శించారు. "దశాబ్దాలుగా ఆదివాసీలను లొంగదీసుకున్న ఉగ్రవాద గ్రూపులపై మా ధిక్కారాన్ని, వ్యతిరేకతను ఇది తెలియజేస్తుంది. స్వేచ్ఛ, న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేయడంలో మాతో చేరండి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశ వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నుంచి మేము మా స్వేచ్ఛను ప్రకటిస్తాము" అని హెచ్‌ఎస్‌ఏ ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా తిరుగుబాటు సంస్థ రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ సెప్టెంబర్ 2000వ సంవత్సరంలో మణిపూర్‌లో హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 12న నిషేధం విధించగా.. వారం రోజుల్లోనే రాష్ట్రంలోని అవుట్‌లెట్ల నుంచి సేకరించిన హిందీ సినిమాలకు సంబంధించిన 6,000 నుంచి 8,000 ఆడియో, వీడియో క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్‌లను తిరుగుబాటుదారులు తగలబెట్టారని అధికారులు తెలిపారు. మణిపూర్‌లో హిందీ సినిమాల నిషేధానికి ఆర్పీఏఫ్ ఎటువంటి కారణం చెప్పలేదు. కాకపోతే రాష్ట్ర భాష, సంస్కృతిపై బాలీవుడ్ సినిమాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తీవ్రవాద సంస్థ భయపడుతున్నట్లు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.
Updated Date - 2023-08-15T15:05:27+05:30 IST