UK: బ్రిటిష్ బామ్మకు జాక్‌పాట్.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు!
ABN, First Publish Date - 2023-09-13T12:10:24+05:30
బ్రిటిష్ బామ్మకు నేషనల్ లాటరీ (National Lottery) రూపంలో అదృష్టం వరించింది. యూకేకి చెందిన డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ (Doris Stanbridge) అనే 70 ఏళ్ల వృద్ధురాలికి తాజాగా ఈ లాటరీలో జాక్‌పాట్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటిష్ బామ్మకు నేషనల్ లాటరీ (National Lottery) రూపంలో అదృష్టం వరించింది. యూకేకి చెందిన డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ (Doris Stanbridge) అనే 70 ఏళ్ల వృద్ధురాలికి తాజాగా ఈ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ (Britain) లో డబ్బు సాలెపురుగులుగా పిలిచే 'మనీ స్పైడర్స్' తరచూ తన ఇంట్లోకి రావడం గమనించిన ఆమె.. వాటిని తన అదృష్టానికి సంకేతంగా భావించింది. అందుకే లాటరీ టికెట్ కొనాలని నిర్ణయించుకుంది. అనంతరం మొబైల్ యాప్ ద్వారా 'సెట్ ఫర్ లైఫ్' లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. అయితే, డోరిస్ తన 70వ బర్త్‌డే వరకు తాను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ను చెక్ చేసుకోలేదట. సరిగ్గా తన పుట్టిన రోజు నాడు ఇ-మెయిల్స్ చెక్ చేసింది. అలా మెయిల్స్ చెక్ చేస్తున్న క్రమంలో ఆమెకు నేషనల్ లాటరీ నుంచి వచ్చిన 'మీరే విజేత' అనే ఇ-మెయిల్ కనిపించింది. వెంటనే ఆమె నేషనల్ లాటరీ తాలూకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయ్యి తన టికెట్‌కే ఆ లాటరీ తగిలినట్టు నిర్ధారించుకుంది.
ఇక ఈ లాటరీ విన్నర్‌గా నిలిచిన డోరిస్‌కి 30 ఏళ్ల పాటు ప్రతి నెల 10వేల పౌండ్స్ వస్తాయి. మన కరెన్సీలో చెప్పాలంటే నెలకు అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. ఇలా నెలకు రూ.10లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆమెకు డబ్బు అందుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ లాటరీ గెలుచుకున్నట్లు తాను మొదట అసలు నమ్మలేదని పేర్కొంది. చివరికి తన భర్త వచ్చి అది నిజమేనని చెప్పేదాకా తనలో నమ్మకం కలగలేదని చెప్పింది. తర్వాత షాంపైన్ బాటిల్‌తో ఆమె తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. 30 ఏళ్లుగా ప్రతి నెలా రూ.10లక్షల డబ్బు అందుతుందంటే తనకు ఇప్పటికీ వింతగా అనిపిస్తోందని డోరిస్ చెప్పుకొచ్చింది. ఇక ఆమె తన మొదటి లాటరీ డబ్బులతో కొత్త బెడ్, ఎయిర్ ఫ్రైయర్ వంటి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసినట్లు కూడా చెప్పింది.
తన ముగ్గురు కూతుళ్లు, ఏడుగురు మనవరాళ్లతో సహా తన పెద్ద కుటుంబంతో కలిసి కార్న్‌వాల్‌కు విహారయాత్రకు కూడా వెళ్లిన్నట్లు తెలిపింది. అలాగే ప్రస్తుతం తాను స్పెయిన్ (Spain) లో కొలను, సూర్యరశ్మి బాగా అందేలా ఉన్న విల్లా కోసం వెతుకుతున్నానని చెప్పింది. తన మనవడు విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారని, దాని గురించి అతను చాలా ఎగ్జైట్ అయ్యాడని పేర్కొంది. ఈ విజయం తన జీవితాన్ని మార్చివేసిందని హర్షం వ్యక్తం చేసింది. తనకు 100 ఏళ్లు వచ్చే వరకు జీవించాలని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఉందని చెప్పింది. ఇక తనకు ఇంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిన డబ్బు సాలెపురుగులను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని డోరిస్ చెప్పుకొచ్చింది.
Metro Train: మెట్రో రైళ్లల్లో అన్నీ గొడవలే కాదండోయ్.. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతాయ్..!
Updated Date - 2023-09-13T12:10:40+05:30 IST