China: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే ట్యాక్సీ.. ఆమోదించిన చైనా ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-10-29T12:54:45+05:30
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ(Flying Taxi)కి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై బీజింగ్ వీధులు, చైనాలోని ప్రధాన నగరాల్లో వీటి సందడి ఉండనుంది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ట్యాక్సీకి కీలకమైన ఏవియేషన్ పేపర్ వర్క్ కి సంబంధించిన టైప్ సర్టిఫికేట్ ని ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది.
బీజింగ్: ట్రాఫిక్ జామ్‌లు ఇకపై ఆ దేశ ప్రజల టైంను హరించలేవు. ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడే ఛాన్సే ఉండదు. గాలిలో ఎగురుతున్న ఫీలింగ్ తో పాటు.. ప్రయాణ గమ్యానికి త్వరగా చేరిస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఊహల్లాగే ఉన్నా.. చైనా(China)లో ప్రజల జీవితం ఇకపై ఇలాగే ఉండనుంది. ఎందుకంటారా ? ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ(Flying Taxi)కి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై బీజింగ్ వీధులు, చైనాలోని ప్రధాన నగరాల్లో వీటి సందడి ఉండనుంది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ట్యాక్సీకి కీలకమైన ఏవియేషన్ పేపర్ వర్క్ కి సంబంధించిన టైప్ సర్టిఫికేట్ ని ప్రభుత్వం ఇప్పటికే ఓకే చెప్పింది. ఇద్దరు కూర్చుని ప్రయాణించే ఈ ట్యాక్సీల ద్వారా ప్రయాణికులు కొత్త అనుభూతి పొందడం పక్కా అంటున్నారు నిపుణులు. తొలి ట్యాక్సీని రూపిందించిన Ehang అనే కంపెనీ దానికి EH 216 - Sగా నామకరణం చేసింది. ఇది స్కేల్డ్-అప్ కన్స్యూమర్ డ్రోన్‌ను పోలి ఉంటుంది. దానిపైన ప్యాసింజర్ బబుల్ అమర్చి ఉంటుంది. ట్యాక్సీ ఆన్ లో లేనప్పుడు రెక్కల్ని ముడుచుకోవడం దీని ప్రత్యేకత. చిన్న చిన్న ప్రదేశాలలో సైతం ఈజీగా ల్యాండ్ అవుతుంది. పూర్తిగా విద్యుత్ సరఫరాతో నడుస్తుంది.
ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు అంటే?
ఎహాంగ్ రూపొందించిన EH216-S ఎయిర్ టాక్సీలు ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియలో పని చేస్తాయి. ఇవి ఇద్దరు ప్రయాణీకులు లేదా 600 పౌండ్ల బరువును మోయగలవు. 16 ఎలక్ట్రిక్ రోటర్ల శక్తి ద్వారా నడుస్తాయి. గంటకు 80 కి.మీ.ల వేగంతో ఒక్క సారి ఛార్జ్ చేస్తే 18 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలవు.
పైలట్లు లేకుండా ఎలా పనిచేస్తాయి?
వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించే కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్యాక్సీలను నియంత్రిస్తారు. ప్రయాణికులు క్యాబిన్ లోపల కూర్చుని టచ్‌స్క్రీన్‌పై తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. ఎయిర్ టాక్సీలకు విమానాశ్రయాలు, రన్‌వేలు వంటి మౌలిక సదుపాయాలు అవసరం లేదు. అనువైన వాతావరణ ప్రదేశాల్లో ఈజీగా ల్యాండ్ అవుతాయి. చైనాకు చెందిన ఎహాంగ్ ఎయిర్ టాక్సీల కోసం సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. ఈ ట్యాక్సీలు కాలుష్య రహితం. రెండు గంటల్లో వీటిని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. తక్కువ శబ్దంతో నడుస్తాయి. ముందు జాగ్రత్తగా బ్యాకప్ బ్యాటరీలు, రోటర్‌లు, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఎమర్జెన్సీ ల్యాండ్ కావాలనుకుంటే పారాచూట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
అనుమతి పొందాయిలా..
2014 నుండి, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 40 వేల ఫ్లైట్లను టెస్ట్ చేశారు. జనవరి 2021లో, ఇహాంగ్.. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAAC) నుంచి టైప్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇది టెస్టింగ్‌లన్నీ నిర్వహించి అనుమతినివ్వడంతో చైనా గగనవీధుల్లో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల ప్రస్థానం ప్రారంభమైంది. భద్రతకు తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అన్నారు. వీటి రాకతో ప్రజా రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. రోడ్లపై వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఇవి అలవోకగా వెళ్లగలవ్. ప్రకృతి రమణీయతను ఆకాశంలోనుంచి చూపిస్తూ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. ట్రాఫిక్ జామ్ లను నివారిస్తాయి. ఎమర్జెన్సీ సమయాల్లో సైతం ఈ ట్యాక్సీలు బాగా ఉపయోగపడతాయి. మనుషుల రవాణాకే కాకుండా ఫుడ్, మెడికల్ సామగ్రి తదితర వస్తువుల డెలివరీకి వీటిని యూజ్ చేయవచ్చు.
ఎదురయ్యే సవాళ్లు...
ఎయిర్ ట్యాక్సీల వల్ల ఎన్ని లాభాలున్నా.. దానికి ఎదురయ్యే సవాళ్లు అదే స్థాయిలో ఉన్నాయి. ఇవి పనిచేసే ఏరియాల్లో ఆయా ప్రభుత్వాల చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాలి. గగనతలంలో వెళ్లే ఇతర వాహనాలతో సమన్వయం చేసుకోవాలి. ప్రజల విశ్వాసాన్ని పొందడం వీటి ముందున్న అతిపెద్ద సవాలు. ఇందుకోసం సదరు కంపెనీ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే వీటి రాక భవిష్యత్తు ప్రయాణరంగంలో పెను మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
Updated Date - 2023-10-29T13:06:36+05:30 IST