Cancer Killing Pill: 9 ఏళ్ల చిన్నారి సహకారంతో.. ఎట్టకేలకు క్యాన్సర్‌కి మందు కనుగొన్న శాస్త్రవేత్తలు
ABN, First Publish Date - 2023-08-03T21:59:36+05:30
క్యాన్సర్.. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఇది ఒకటి. దీని శాశ్వత నివారణ కోసం శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ.. ఫలితం మాత్రం దక్కడం లేదు. ఓవైపు క్యాన్సర్ మరణాలు పెరుగుతుంటే, మరోవైపు ప్రయోగాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి...
క్యాన్సర్.. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఇది ఒకటి. దీని శాశ్వత నివారణ కోసం శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ.. ఫలితం మాత్రం దక్కడం లేదు. ఓవైపు క్యాన్సర్ మరణాలు పెరుగుతుంటే, మరోవైపు ప్రయోగాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఓ ప్రయోగం విజయవంతం అయ్యింది. 9 ఏళ్ల చిన్నారి సహకారంతో.. శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ను నివారించే ఒక మందుని కనుగొన్నారు. ఆనా ఒలివియా హీలీ పేరు మీద ఈ మెడిసిన్‌కి AOH1996 అనే పేరు పెట్టారు. క్యాన్సర్‌తో 2005లో మృతి చెందిన ఈ అమ్మాయి.. ఈ మెడిసిన్‌ని కనుగొడనంలో పెద్ద పాత్ర పోషించింది. ఈ కొత్త మెడిసిన్ క్యాన్సర్ కణితుల్ని మూలం నుంచి తొలగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న సిటీ ఆఫ్ హోప్స్ అనే ఆసుపత్రి.. గత 20 సంవత్సరాలుగా క్యాన్సర్‌ను శాశ్వతంగా నివారించే మెడిసిన్ కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ పరిశోధనల తర్వాత తాము ఈ మెడిసిన్‌ని తయారు చేయగలిగామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 1996లో జన్మించిన ఆనా ఒలివియా హీలీచే ఈ మెడిసిన్ ప్రేరణ పొందిందని అన్నారు. న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ కారణంగా ఆ అమ్మాయి 2005లో తన 9వ ఏట కన్నుమూసింది. బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా మొత్తం 70 రకాల క్యాన్సర్లపై తాము ఈ మెడిసిన్‌ని ల్యాబ్‌లో పరిక్షించామని.. ఇది సానుకూల ప్రభావం చూపించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మెడిసిన్.. క్యాన్సర్ కణాల్లో కనిపించే ప్రొలిఫెరేటింగ్ సెల్ న్యూక్లియర్ యాంటిజెన్ (PCNA)ను నేరుగా టార్గెట్ చేస్తుందని చెప్పారు.
ఈ మెడిసిన్ గురించి ప్రొఫెసర్ లిండా మల్కాస్ మాట్లాడుతూ.. ఇది క్యాన్సర్ ప్రోటీన్‌ను తొలగించడంలో సహాయపడుతుందని, తద్వారా కణితి త్వరగా అభివృద్ధి చెందదని అన్నారు. ఒకవేళ కణితి అభివృద్ధి చెందితే.. దాన్ని తొలగించడంలో ఈ మెడిసిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని నిరూపించబడిందని చెప్పారు. ప్రస్తుతం ఈ మెడిసిన్ సిటీ ఆఫ్ హోప్‌లో మొదటి దశ క్లినికల్ ట్రయల్‌లో ఉందని.. గత పరిశోధనలో ఈ మెడిసిన్ సానుకూల ఫలితాల్ని సాధించిందని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత క్యాన్సర్ నివారణకు మందు వచ్చింది కాబట్టి.. ఇది క్యాన్సర్ బాధితులకు ఊరట కలిగించే విషయమే!
Updated Date - 2023-08-03T21:59:36+05:30 IST