బ్యాంకు లాకర్లో కరెన్సీ నోట్ల కట్టలు.. తీసుకుందామని వెళ్లిన కస్టమర్.. తాళం తీసి చూడగానే కనిపించిన సీన్ చూసి..!
ABN, First Publish Date - 2023-02-11T18:23:13+05:30
ఇళ్లల్లో భద్రత ఉండదనే ఉద్దేశంతో చాలా మంది తమ నగదు, నగలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు బ్యాంకులోని నగదూ సేఫ్‌గా ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వలేం. ఇందుకు సంబంధించిన ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా..
ఇళ్లల్లో భద్రత ఉండదనే ఉద్దేశంతో చాలా మంది తమ నగదు, నగలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు బ్యాంకులోని నగదూ సేఫ్‌గా ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వలేం. ఇందుకు సంబంధించిన ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా, రాజస్థాన్‌లో ఓ బ్యాంకు ఖాతాదారుకు విచిత్ర సమస్య వచ్చి పడింది. బ్యాంకు లాకర్లో ఉన్న నగదును తీసుకెళ్లేందుకు వెళ్లిన కస్టమర్‌కు.. తాళం తీయగానే షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) ఉదయ్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సునీతా మెహతా అనే మహిళకు.. సదరు బ్యాంకులో అకౌంట్ (Bank account) ఉంది. తన లాకర్‌లో ఉన్న రూ.2.15లక్షల నగదును (cash) తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్లింది. అయితే లాకర్ తెరచిన వారు.. లోపల దృశ్యం చూసి షాక్ అయ్యారు. వాటిలో చాలా నోట్లు చెదలు (Termites) తినేయడం చూసి.. ఖాతాదారుతో పాటూ బ్యాంకు సిబ్బంది (Bank staff) అవాక్కయ్యారు. లాకర్‌లో ఉన్న నగదు ఇలా పాడవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. బ్యాంకు సిబ్బందితో గొడవకు దిగింది. చివరకు బ్యాంకు మేనేజర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ముందుగా పాడయిన రూ.15వేల నోట్లను మార్చారు.
అయితే మరుసటి రోజు బ్యాంక్‌కు వచ్చి పరిశీలిస్తే.. మిగిలిన రూ.2లక్షల నోట్లు కూడా పూర్తిగా (Damaged currency notes) పాడయ్యాయి. దీంతో బ్యాంకులో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. చివరకు దిగొచ్చిన బ్యాంకు అధికారులు.. సదరు ఖాతాదారుకు మొత్తం నగదును చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులో మొత్తం 25లాకర్లు ఉన్నాయని, అయితే లాకర్ల (Bank lockers) పక్కనే ఉన్న గోడలకు తేమ వ్యాపించిందని తెలిసింది. తద్వారా లాకర్ల లోపలికి చెదపురుగులు వచ్చి చేరాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మిగతా ఖాతాదారులు (Bank customers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందే స్పందించి ఉంటే ఇలాంటి సమస్య వచ్చుండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాడయిన నోట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Updated Date - 2023-02-11T18:23:18+05:30 IST