Viral Video: విమానంలో వివాహం.. ఇలాంటి పెళ్లి మీరెక్కడా చూసి ఉండరు
ABN, First Publish Date - 2023-11-27T13:42:48+05:30
ఇండియాకు చెందిన పోప్లీ, హ్రిదేష్ సైనానీలు ప్రేమించుకుంటున్నారు. వివాహం జరుపుకోవడానికి దుబాయ్(Dubai) నుంచి ఒమెన్ కు వెళ్లే బోయింగ్ విమానాన్ని బుక్ చేశారు.
దుబాయి: సాధారణంగా వివాహాలు అనగానే.. కల్యాణ మండపాలు గుర్తొస్తాయి. అయితే ఓ జంట జరుపుకున్న పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వీడియో(Viral Video)పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. భారత్ కు చెందిన ఈ ప్రేమ జంట తమ పెళ్లి తరతరాలకు గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా బోయింగ్ 747 విమానాన్ని బుక్ చేసింది.
ఇండియాకు చెందిన పోప్లీ, హ్రిదేష్ సైనానీలు ప్రేమించుకుంటున్నారు. వివాహం జరుపుకోవడానికి దుబాయ్(Dubai) నుంచి ఒమెన్ కు వెళ్లే బోయింగ్ విమానాన్ని బుక్ చేశారు. అందులో 300 మంది అతిథులకు సీట్లు బుక్ చేశారు. విమానం గాలిలో ఉండగానే దండలు మార్చుకుని పెళ్లి తంతు పూర్తి చేశారు.
బంధువులు, అతిథులు ఈ సంబరాలు చూస్తూ కేరింతలు కొడుతూ.. జంటను ఆశీర్వదించారు. అక్కడికి వచ్చిన వారందరికీ సెవన్ స్టార్ భోజనాన్ని అందించారు. విమాన సీట్లన్ని పూలతో అలంకరించారు. వేడుకను చూడటానికి వీలుగా ప్రతి సీటు ముందుభాగంలో ప్రొజెక్టర్ అమర్చారు. అయితే 1994లో పోప్లీ తండ్రి దిలీప్ పొప్లీ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్(Air India) A310లో సునీతతో కలిసి వివాహం చేసుకున్నారు.
అంటే 30 ఏళ్ల తరువాత తండ్రి రికార్డును కుమారుడు తిరగరాశాడన్నమాట. వీరి కుటుంబం యూఏఈలో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానంలో కుమారుడి పెళ్లి చేయాలనేది తన కల అని ఇందుకోసం ఎయిర్ ఇండియా ఛైర్మన్ ని కలిసి పర్మిషన్ అడిగినట్లు దిలీప్ పోప్లీ తెలిపారు. లగ్జరీ జ్యువెలరీలో పాప్లీ గ్రూప్(Popley Group) ప్రఖ్యాతి గాంచింది. దీన్ని 1927లో స్థాపించారు. ఇది దుబాయ్, ముంబయిలలో అనేక షోరూంలను కలిగి ఉంది.
Updated Date - 2023-11-27T13:47:44+05:30 IST