Sourabh Chandrakar: ఎవరీ చంద్రశేఖర్..? గల్ఫ్ గడ్డపై పెళ్లి కోసం రూ.200 కోట్ల ఖర్చు.. క్యూ కట్టిన బాలీవుడ్ సెలబ్రెటీలు..!
ABN, First Publish Date - 2023-09-16T17:55:55+05:30
మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వినిపించడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో తాజాగా రూ.417కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే కొన్ని నెలల క్రితం..
మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వినిపించడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో తాజాగా రూ.417కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే కొన్ని నెలల క్రితం యూఏఈలో జరిగిన చంద్రశేఖర్ అనే వ్యక్తి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అతడి వివాహం కోసం ఏకంగా రూ.200కోట్లు ఖర్చు చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఎవరీ చంద్రశేఖర్..? ఈ కేసుకు బాలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధం ఏంటీ..? తదితర వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ అనే వ్యక్తులు దుబాయ్ కేంద్రంగా మహదేవ్ యాప్ పేరుతో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వీరిద్దరూ యూఏఈలో తమ కోసం ఏకంగా ఓ సామ్రాజ్రాన్నే సృష్టించుకున్నారని తెలిసింది. అయితే ఈ యాప్ మాటున పెద్ద ఎత్తున హవాలా డబ్బు చేతులు మారినట్లు ఈడీ అధికారులు (ED officials) గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు తెలిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. కోల్‌కతా, ముంబయి, భోపాల్ (Kolkata, Mumbai, Bhopal) తదితర నగరాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కొన్ని కీలక ఆధారాలను సేకరించిన ఈడీ.. మొత్తం రూ.417కోట్ల ఆస్తులను సీజ్ చేసింది.
ఇదిలావుండగా, మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) నిర్వాహకుల్లో ఒకరైన సౌరబ్ చంద్రశేఖర్ వివాహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రశేఖర్ వివాహం యూఏఈలో (UAE) ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సుమారు రూ.200కోట్లు ఖర్చు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివాహ సమయంలో చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు (Viral photos) ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహానికి తన బంధువులు, స్నేహితులతో పాటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం ఆహ్వానించారు. వారి కోసం అతను ఏకంగా ప్రైవేట్ జెట్ విమానాలను (Private jet flights) సైతం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
అలాగే హోటల్‌లోని గదుల కోసమే సుమారు రూ.42కోట్లు, ఇక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112కోట్లను హవాలా మార్గంలో చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. చంద్రశేఖర్ వివాహానికి బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, నేహాకక్కర్, సన్నీ లియోనీ, విశాల్ దద్లానీ, అలీ ఖాన్, అతిఫ్ అస్లమ్ తదితరులు హాజరైనట్లు తెలిసింది. దీంతో ఈడీ (Enforcement Directorate) అధికారులు వీరికి కూడా సమన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు మళ్లించేందుకు నిర్వాహకులు హావాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అదే విధంగా కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రకటనల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు కూడా ఈడీ పేర్కొంది. కాగా, ప్రస్తుతం బెట్టింగ్ నిర్వాహకుడైన చంద్రశేఖర్ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-16T17:55:55+05:30 IST