Interest rates hikes: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ పథకాలపై వడ్డీ రేటు పెంపు
ABN, First Publish Date - 2023-06-30T19:39:25+05:30
కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన పలు చిన్న పొదుపు పథకాలపై (Small saving schemes) వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి 0.3 శాతం మేర పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 5 ఏళ్ల రిక్కరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 0.3 శాతం మేర పెంచుతున్నట్టు ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన పలు చిన్న పొదుపు పథకాలపై (Small saving schemes) వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి 0.3 శాతం మేర పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 5 ఏళ్ల రిక్కరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 0.3 శాతం మేర పెంచుతున్నట్టు ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో రిక్కరింగ్ డిపాజిట్ (RD) కలిగివున్నవారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 6.5 శాతం వడ్డీని పొందుతారని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
తాజా సవరణతో పోస్టాఫీస్ 1 ఏడాది టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగి 6.9 శాతానికి చేరింది. ఇక రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. అయితే మూడేళ్లు, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 7 శాతం, 7.5 శాతం చొప్పున యథావిథిగా కొనసాగిస్తున్నట్టు ఆర్థికశాఖ తెలిపింది. ఆదరణ ఎక్కువగా ఉండే పీపీఎఫ్, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ఏ మార్పూ లేకుండా 7.1 శాతం, 4 శాతం చొప్పున కొనసాగుతాయని తెలిపింది.
ఎన్ఎస్‌సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్) వడ్డీ రేటును కూడా మార్పు చేయకుండా 7.7 శాతంగా కొనసాగిస్తున్న నోటిఫికేషన్‌లో వివరించింది. ఇక సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు కూడా యథాతథంగా 8 శాతం కొనసాగనుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (8.2 శాతం), కిసాన్ వికాస్ పాత్ర (7.5 శాతం), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (7.4 శాతం) కూడా ఎలాంటి మార్పులేదు. కాగా కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై సమీక్ష, సవరణ చేపడుతుంటుంది. వడ్డీ రేట్లకు అనుగుణంగా మార్పులు చేస్తుంటుంది. ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్లు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.
Updated Date - 2023-06-30T19:39:25+05:30 IST