Karnataka elections: వామ్మో.. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇన్ని ఆస్తులా?.. అఫిడవిట్లు చూస్తే దిమ్మతిరిగిపోతోంది!
ABN, First Publish Date - 2023-04-20T17:47:24+05:30
మే 10న ఓటింగ్‌కు సిద్ధమవుతున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో (Karnataka polls 2023) అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను అక్కడి ఓటర్లు గమనిస్తున్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.
బెంగళూరు: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, వారి ఆస్తిపాస్తులు ఎప్పుడూ ఆసక్తిదాయకమే. ఇక అసెంబ్లీ, లోక్‌సభ వంటి ప్రధాన ఎన్నికల ఘట్టాలలో బరిలో నిలిచే అభ్యర్థుల చరిత్రను ఓటర్లు నిశితంగా గమనిస్తుంటారు. మే 10న ఓటింగ్‌కు సిద్ధమవుతున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ (Karnataka polls 2023) ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను అక్కడి ఓటర్లు గమనిస్తున్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
కాగా కర్ణాటక ఎన్నికల బరిలో నిలిచేందుకు మొత్తం 770 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ జాబితాలో బీజేపీ నుంచి కాంగ్రెస్, జేడీఎస్‌తోపాటు ఇతర పార్టీలకు చెందిన హేమాహేమీలు, ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వీరిలో కొందరి వ్యక్తిగత సంపద విలువ ఓటర్ల దిమ్మతిరిగేలా చేస్తోంది.
ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన సంపన్న అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ (Congress) మాజీ ఎమ్మెల్యే, గోవిందరాజనగర్‌కు చెందిన ప్రియ కృష్ణ (Priya Krishna) ఉన్నారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ ఏకంగా రూ.1,156 కోట్లుగా ఉంది. గత ఐదేళ్లలో ఆయన ఆస్తి విలువ రూ.136.8 కోట్ల మేర పెరిగిందని, అయితే ఇదే సమయంలో అప్పులు కూడా పెరిగాయని ఆఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. 2018లో రూ.802 కోట్లుగా ఉన్న అప్పులు ప్రస్తుతం రూ.881.99 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఇందులో రూ.780.87 కోట్లు ‘సండ్రీ క్రెడిటర్స్’కు చెల్లించాలని అఫిడవిట్‌లో వివరించారు. కాగా 2013లో రూ.910 కోట్లుగా ఉన్న తన ఆస్తి విలువ 2018 నాటికి రూ.1020 కోట్లకు పెరిగిందని అఫిడవిట్‌లో వెల్లడించారు. కాగా 2009 ఉపఎన్నికలో గోవిందరాజనగర్ ఎమ్మెల్యేగా ఎం కృష్ణ గెలుపొందారు. కాగా కృష్ణ తండ్రి రియల్టర్-పొలిటీషియన్. ఆయన ఎం.క్రిష్ణప్ప. విజయనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కార్లు అన్నింటికీ ఒకటే నంబర్...
ప్రియ కృష్ణ తన ప్రైవేటు కార్లు అన్నింటికీ ఒకటే ఫ్యాన్సీ నంబర్ ఉండేలా చూసుకుంటారు. వీటికి రిజిస్ట్రేషన్ నంబర్ 9279గా ఉంది. బెంగళూరులోని వేర్వేరు ప్రాంతీయ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుల్లో ఆయన రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు. కాగా స్థిరాస్తుల్లో కొన్ని బహుమతుల రూపంలో వచ్చాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇంకొందరు ధనవంతులు వీళ్లే..
బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఎన్.నాగరాజు (ఎంటీబీ) ఆస్తి విలువ ఏకంగా రూ.1,614.5 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని ఆయనే నామినేషన్‌లో స్వయంగా డిక్లేర్ చేశారు. ఇక హెబ్బల్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బీఎస్ సురేష్.. (బైరాతి సురేష్) ఆస్తుల విలువ రూ.648.12 కోట్లుగా ఉంది. గత ఐదేళ్లలో ఆయన సంపద విలువ రూ.231.42 కోట్ల మేర పెరిగింది. 2018లో తన ఆస్తి విలువ 114.86 కోట్లుగా ఆయన వెల్లడించారు. మరోవైపు మైనింగ్ డాన్‌గా పేరొందిన గాలి జనార్థన్ రెడ్డి (Gali Janardhan reddy) భార్య గాలి లక్ష్మి అరుణ సంపన్న అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భర్త కంటే ఆమె పేరిట ఉన్న ఆస్తి విలువే ఎక్కువగా ఉంది. ఇక దంపతుల ఉమ్మడి ఆస్తి విలువ రూ.250 కోట్లుగా తన అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు. కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి ఆమె నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీకి చెందిన ప్రముఖ నేత, రెవెన్యూ మినిస్టర్ ఆర్ అశోక్ తన అవిభజిత కుటుంబ ఆస్తి విలువ రూ.75.73 కోట్లుగా పేర్కొన్నారు. 2018లో రూ.32.04 కోట్లుగా ఉండగా ఐదేళ్లలో రెట్టింపుపైగా పెరిగిందని వివరించారు.
మరిన్ని చదవండి...
TDP: చంద్రబాబుకి విజయసాయి బర్త్‌డే విషెస్.. ఆసక్తికర ట్వీట్.. అచ్చెన్నాయుడి స్పందన ఇదే..
Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!
Updated Date - 2023-04-20T17:56:53+05:30 IST