Balakrishana: అక్కినేని-తొక్కినేని వివాదంపై బాలకృష్ణ స్పందన.. ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-01-26T15:13:09+05:30
వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో వివాదాస్పద అక్కినేని.. తొక్కినేని వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.
లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో వివాదాస్పద అక్కినేని.. తొక్కినేని వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్పందించారు. నాన్నగారు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara rao) ఇండస్ట్రీకి రెండు కల్లలాంటివారని వ్యాఖ్యానించారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. ‘‘ నాగేశ్వరరావు గారు ఆయన పిల్లలకంటే నన్నే ఎక్కువగా ప్రేమించేవారు. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికే అందించడం జరిగింది. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది. నాన్నగారి నుంచి క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అనే విషయాలను నేర్చుకున్నాను. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను. అభిమానంతో, యాసతో అలా పిలుచుకుంటాం. నా గురించి అందరికీ తెలుసు. ఆప్యాయత నా గుండెల్లో ఉంటుంది. తాడోపేడో అంటాం.. పేడోకు అర్థం ఏముంటుంది’’ అని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో మీడియాతో మాట్లాడారు.
యువగళం యువత భవిష్యత్తుకు పునాది
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టబోతున్న ‘యువగళం’ పాదయాత్రకు అనుసంధానంగా చాలా కార్యక్రమాలు చేపతామని బాలకృష్ణ తెలిపారు. లోకేష్ బాబు యువగళాన్ని విజయవంతం చేయాలని, పాదయాత్రను ఆశీర్వదించాలని కోరారు. యువగళం యువత భవిష్యత్తుకు పునాది వేస్తుందన్నారు. యువత పెడధోరణి పట్టకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా అన్నారు. నందమూరి రామారావు శత జయంతి ఉత్సవాలను లేపాక్షి ఉత్సవాలు మహానాడులాగా నిర్వహిస్తామని బాలకృష్ణ వెల్లడించారు.
Updated Date - 2023-01-26T16:12:30+05:30 IST