Modi adani: అదానీ అక్రమాలపై మోదీ మౌనం నేరమే అవుతుందా?.. 1958లో ఫిరోజ్ గాంధీ అసలేం చెప్పారు?
ABN, First Publish Date - 2023-02-13T18:14:10+05:30
సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఫిరోజ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా చెప్పాలంటే తన మామ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి పార్లమెంటులో...
అదానీ గ్రూప్ (Adani Group) అన్ని రంగాల్లో గుత్తాధిపత్యం సాధించడానికి కారణమెవరంటే...అన్ని వేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వైపే చూపెడుతున్నాయి. అయితే మోదీ మాత్రం అదానీ (Adani) ఎవరో తనకసలు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. విపక్షాలు ఎంత గొంతు చించుకుంటున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో 1958 నాటి ఎల్‌ఐసీ-ముంధ్రా స్కామ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎల్ఐసీ-ముంద్రా స్కామ్ కారణంగా అప్పటి ఆర్థికశాఖ మంత్రి టీటీ కృష్ణమాచారి(టీటీకే) రాజీనామా వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందిరాగాంధీ (Indira Gandhi) భర్త, నెహ్రూ (Nehru) అల్లుడు అయిన ఫిరోజ్ గాంధీ (Feroze Gandhi) పార్లమెంటులో ఎల్ఐసీ -ముంద్రా కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న నెహ్రూ (Nehru) ఏం చేశారు, టీటీకే ఎందుకు రాజీనామా చేశారు?.. సొంత పార్టీకి చెందిన ఎంపీనే ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా నెహ్రూ వాటిని ఎలా స్వీకరించారు?. జేపీసీ వేసి నిజాలను ఎలా నిగ్గు తేల్చారు?... ఈ విషయాలే ప్రస్తుతం పార్లమెంటు లాబీల్లో ఎంపీల మధ్య చర్చనీయాంశమయ్యాయి. అదానీ - హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నేపథ్యంలో మరి మోదీ ఎందుకు నెహ్రు హయాం నాటి రాజకీయ విలువలను పాటించడం లేదన్న ప్రశ్న చర్చనీయాంశమైన నేపథ్యంలో అసలు ఫిరోజ్ గాంధీకి (Feroze Gandhi) ఎల్ఐసీకి ఉన్న సంబంధం ఏంటి? అదానీ గ్రూప్ అక్రమాల నేపథ్యంలో ఎల్ఐసీ వ్యవహారం ఎందుకు తెరపైకి వచ్చిందన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా రాసిన వ్యాసం ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు ఎల్ఐసీ ఎలా ఏర్పాటైంది. దాని వెనుక ఉన్న అసలు కారణాలేంటి?. 1958లో టీటీ కృష్ణమాచారి ఆర్థికమంత్రిగా ఎందుకు రాజీనామా చేశారన్న విషయాలన్నింటినీ తన వ్యాసంలో డీ. రాజా క్షుణ్ణంగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 18, 1958న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న టీటీ కృష్ణమాచారి (టిటికె) తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు ఎల్‌ఐసి-ముంధ్రా స్కామ్ దారితీసింది. అప్పట్లో కొత్తగా ఏర్పాటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... కోల్‌కతాకు చెందిన పారిశ్రామికవేత్త హరిదాస్ ముంద్రా నియంత్రణలోని సంస్థల్లో రూ. 1.26 కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే ముంద్రా యాజమాన్యంలోని ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారాలకు సహాయం చేయడానికే ముంధ్రా సంస్థల్లో అధిక విలువ కలిగిన ధరకు ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వతా అవి రుజువయ్యాయి కూడా.
అదానీ గ్రూప్‌పై ప్రస్తుతం వెలువడుతున్న ఆరోపణలు, ఎల్‌ఐసీ-ముంధ్రా కుంభకోణంతో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. పరిశోధనాత్మక జర్నలిస్టుగా, సమర్థుడైన పార్లమెంటేరియన్‌గా పేరు తెచ్చుకున్న ఫిరోజ్ గాంధీ 1955లో లోక్‌సభలో తన తొలి ప్రసంగం ద్వారా ప్రైవేట్ బీమా రంగంలోని అక్రమాలు, అవినీతిని తెరపైకి తీసుకొచ్చారు. దాల్మియా-జైన్ గ్రూపుకు చెందిన రామకృష్ణ దాల్మియాపై ఆయన అభియోగాలు మోపారు. అవి రుజువయ్యాయి. ఆ తరువాత జూన్ 1957లో, హరిదాస్ ముంధ్రాకు చెందిన ఆరు కంపెనీలలో ఎల్‌ఐసీ రూ.1 కోటికి పైగా పెట్టుబడి పెట్టింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎల్‌ఐసీ పెట్టుబడి కమిటీని కూడా సంప్రదించలేదు. దీంతో సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఫిరోజ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా చెప్పాలంటే తన మామ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి పార్లమెంటులో ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు.
ఆరోపణలు చేసింది సొంత పార్టీ సభ్యుడే అయినా నెహ్రూ ఊరుకోలేదు. నెహ్రూ ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణకు ఎంసీ చాగ్లా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 24 రోజుల వ్యవధిలోనే కమిషన్ తన పనిని పూర్తి చేసింది. చాగ్లా కమిషన్ విచారణలన్నీ పారదర్శకంగా జరిగాయి. ఆరోపణలు నిజమని కమిషన్ గుర్తించడంతో ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా అదానీ గ్రూప్ అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలకు నాటి ఎల్ఐసీ ముంద్రా స్కామ్ ప్రస్తావనకు వచ్చింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వెలువడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్న ఆరోపణలు ఇందుకు కారణమవుతున్నాయి.
ప్రభుత్వ స్పందనలేని ప్రశ్నలివే..
ఎలాంటి అనుభవం లేకుండానే విమానాశ్రయ కార్యకలాపాలు సాగించినా, ఆస్ట్రేలియాలో గనులు సంపాదించినా ,బంగ్లాదేశ్ నుండి విద్యుత్ కాంట్రాక్టులు పొందినా భారత ప్రభుత్వం మాత్రం ప్రశ్నించలేదు. పైగా సహకరించిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. అదానీ కంపెనీల వల్ల సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారులకే కాకుండా దేశ ప్రయోజనాలకు కూడా నష్టమన్నది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట. రక్షణ రంగం వంటి అనేక కీలక రంగాలలో అదానీ గ్రూప్ సాధించిన లాభంతో దేశ ప్రయోజనాలు కూడా రాజీపడినట్లు అనిపిస్తొందని చెబుతున్నారు. ఎల్ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రీమియం సంస్థలు, ప్రముఖ ఆర్థిక సంస్థలు అదానీ గ్రూప్ (Adani group) గణనీయమైన లాభాలు ఆర్జించడానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక సమగ్రతకు ప్రమాదం కలిగిస్తుందని, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముంద్రా వ్యవహారంపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఫిరోజ్ గాంధీ మాట్లాడుతూ "ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినప్పుడు ఎవరూ మానం దాల్చకూడదు. మౌనం కూడా నేరం అవుతుంది" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అదానీ అక్రమాలపై మోదీ మౌనం నేరమే అవుతుందని చెప్పే స్వపక్ష నేతలు ఎవరున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే, జవాబుదారీతనానికి నిజమైన అర్ధంసరిచేయాలంటే జేపీసీ అవసరమే. నిజం బయటకు రావాలి. నిజాన్ని చూసి ఎవరూ భయపడకూడదు. మరి మోదీ నిజాన్ని చూసి భయపడతారా లేక జేపీసీ వేస్తారా? అన్నదే ఇప్పుడు అందరూ లేవనెత్తున్న ప్రశ్న. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తారో చూడాలి.
Updated Date - 2023-02-13T18:14:18+05:30 IST