PCOS: మహిళల్లో పిసిఓయస్ కు అసలు కారణాలు ఇవే.. చేతులారా ఇంత సమస్య తెచ్చిపెట్టుకుంటున్నారెందుకు?
ABN, First Publish Date - 2023-03-26T17:30:29+05:30
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(Polycystic ovary syndrome) గా పిలిచే ఈ సమస్య మహిళల్లో గర్భం ధరించే అవకాశాన్ని తగ్గిస్తుంది..
ప్రస్తుతకాలంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో పిసిఓయస్(PCOS) ఒకటి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(Polycystic ovary syndrome) గా పిలిచే ఈ సమస్య మహిళల్లో ఆండ్రోజన్(androgen), ఇన్సులిన్(insulin), ప్రొజెస్టెరాన్(progesterone) అనే మూడు హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా మహిళలకు గర్భం ధరించే అవకాశాన్ని తగ్గిస్తుంది. అయితే మహిళలు చేసే అయిదు పనుల కారణంగానే ఈ పిసిఓయస్ సమస్య వస్తోంది. ఈ విషయం చాలామందికి షాకింగ్ గా అనిపిస్తుంది కానీ అదే నిజం. తెలిసీ తెలియక రోజూ చేసే ఆ పనుల గురించి తెలుసుకుని వాటిని అవాయిడ్ చేస్తే ఈ సమస్య మందులతో పనిలేకుండా మెల్లిగా తగ్గిపోతుంది. ఇంతకూ ఆ పనులేంటంటే..
ఆహారంలో కొవ్వులు..
తీసుకునే ఆహారంలో కొవ్వులు లేకపోతే శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి తగినంత జరగదు. శరీరంలో సరైన మోతాదులో హార్మోన్లు లేకపోతే అవి పిసిఓయస్ సమస్యకు దారితీస్తాయి. నాణ్యమైన కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోకపోవడం అందరూ చేస్తున్న తప్పు.
గర్భనిరోధక మాత్రలు వాడటం..(birth control pills)
ఇప్పటికాలం అమ్మాయిలు పెళ్ళయ్యాక తొందరగా గర్భవతులవడానికి ఇష్టపడటం లేదు. ఈ కారణంగా గర్బం దాల్చకుండా టాబ్లెట్లు వాడుతుంటారు. ఈ టాబ్లెట్లు వాడినన్నిరోజులు వారికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఇవి వాడటం ఆపేశాక శరీరంలో ఆండ్రోజన్ హార్మోన్ చాలా మొత్తంలో పెరుగుతుంది. అంతేకాకుండా పిట్యూటరీ గ్రంధి, అండాశయాల మధ్య సంబంధాన్ని తగ్గిస్తుంది. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడిన చాలామంది మహిళలు పిసిఓయస్ బారిన పడుతున్నారు.
టెన్షన్..
ఇప్పట్లో జీవితాలు చాలావరకు ఒత్తిడితో కూడుకున్నవే.. చిన్నచిన్న సమస్యలు వచ్చినా బెంబేలు పడిపోతారు. కారణాలు ఏవైనా సరే.. టెన్షన్ పడటం మామూలైపోయింది. ఈ టెన్షన్ వల్ల కార్టిసాల్ హార్మోన్ DHEA స్రావాన్ని పెంచుతుంది. ఈ స్రావాలు పెరిగితే పిసిఓయస్ సమస్య వస్తుంది.
నిద్రలేమి..
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. నిద్ర గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. నిద్రసరిగా లేకపోతే పేగు ఆరోగ్యం దెబ్బతిని అక్కడ మంట ఏర్పడుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. హార్మోన్లు అస్తవ్యస్తమైనప్పుడు పిసిఓయస్ సమస్య వస్తుంది.
బేకరి ఫుడ్స్ తినడం..
అమ్మాయిలకు కేకులు, బేకరీ ఫుడ్స్ అంటే ఇష్టం. అయితే ఈ ఫుడ్ తయారీలో శుద్దిచేసిన పిండిగా పిలిచే మైదా వాడతారు.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ స్రవిస్తుంది.బేక్ చేసిన ఆహారాన్ని పదే పదే తీసుకోవడం వల్ల ఇలా ఇన్సులిన్ స్రవించే ప్రాసెస్ కూడా పదే పదే జరిగుతుంది. అది పిసిఓయస్ సమస్యకు దారితీస్తుంది.
Updated Date - 2023-03-26T17:30:52+05:30 IST