ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pee-Gate: వీళ్ళ చిల్లర వేషాలకు చెక్ పడేదెప్పుడు?

ABN, First Publish Date - 2023-03-06T18:57:31+05:30

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.... మనిషి ఎలా బతకాలో, ఎలా ఉండకూడదో విడమరిచి చెప్పే ప్రవచనాలు, సూక్తులు, జీవిత సత్యాలు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. ఇవన్నీ వింటూ... చూస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.... మనిషి ఎలా బతకాలో, ఎలా ఉండకూడదో విడమరిచి చెప్పే ప్రవచనాలు, సూక్తులు, జీవిత సత్యాలు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. ఇవన్నీ వింటూ... చూస్తూ... షేర్ చెయ్యడంతోనే తాము సివిల్ సొసైటీలో ఎంతో ప్రోగ్రెసివ్‌గా బతికేస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతూ అందరిలోనూ అభాసుపాలవుతున్నారు. మరీ ముఖ్యంగా సూటు బూటు వేసుకుని విమానాల్లో ప్రయాణిస్తూ... చదువుకున్నవాళ్లని, సంస్కారం ఉన్నవారని సమాజం భావిస్తూ గౌరవిస్తున్న వ్యక్తులు తమ అసభ్య ప్రవర్తనతో ఛీకొట్టించుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులు, ఇంటర్నేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు సైతం తమ దిగజారుడు తీరుతో..... నిజంగా సంస్కారం ఉన్నవారిని సైతం అనుమానించే పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన వరుస ఘటనలు... ఇలాంటి వాటికి ఊతమిస్తున్న వ్యవస్థలపై ఓ కథనం...

గతేడాది నవంబరు 26న న్యూయార్క్(New York) నుంచి న్యూఢిల్లీ(New Delhi) వెళ్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా(Shankar Mishra) అనే వ్యక్తి 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత శంకర్ మిశ్రా పరారు కావడం, బెంగళూరులో అతడిని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయంలో తమ తప్పు కూడా ఉందని ఎయిర్ ఇండియా ఆలస్యంగా అంగీకరించింది. ఈ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖర్ ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. శంకర్ మిశ్రాపై తొలుత నెల రోజులపాటు నిషేధం విధించిన ఎయిరిండియా విమర్శలకు తలొగ్గి ఆ తర్వాత నాలుగు నెలలపాటు నిషేధించింది. మరోవైపు, ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో శంకర్ మిశ్రాను తొలగించింది.

పారిస్-ఢిల్లీ విమానంలో..

న్యూయార్క్-న్యూఢిల్లీ పీగేట్(Pee Gate) ఘటనను మర్చిపోకముందే డిసెంబరు 6న పారిస్(Paris)-ఢిల్లీ ఎయిరిండియా విమానంలోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత నిందితుడు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఆ సమస్య అక్కడితో ముగిసింది.

ఈసారి బస్సులో..

విమానాల్లో మూత్ర విసర్జనల గొడవలపై చర్చ జరుగుతుండగానే కర్ణాటక(Karnataka)లో అలాంటి ఘటనే మరోటి జరిగింది. అయితే, ఇది బస్సులో. విజయపుర నుంచి మంగళూరు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు(KSRTC)లో ఇంజినీరింగ్ పట్టభద్రుడు తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. అర్ధరాత్రి వేళ హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరు ప్రాంతంలో ఓ దాబా వద్ద టీ తాగేందుకు బస్సును ఆపారు. చాలామంది ప్రయాణికులు బస్సు దిగారు. అయితే, బస్సు వెనక కూర్చున్న రామప్ప (25) అనే మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్న యువకుడు బస్సు ముందు వరుసలో కూర్చుని నిద్రపోతున్న మహిళ వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. ఆమె తుళ్లిపడి లేచి అరవడంతో డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికులు పరుగు పరుగున వచ్చి యువకుడిని పట్టుకుని చావబాదారు.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో..

తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) విమానంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీకి చెందిన ఆర్య వోహ్రా (21) మద్యం మత్తులో విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతోపాటు సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో అనుచితంగా ప్రవర్తించిన ఆ విద్యార్థిని భవిష్యత్తులో తమ విమాన సర్వీసుల్లో ప్రయాణించకుండా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ నిషేధం విధించింది.

ఉన్నత చదువులు చదువుకున్న వారే..

విమాన ప్రయాణం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు మాత్రం చాలా వరకు ఉన్నత చదువులు, బిజినెస్ ట్రిప్స్, ఉద్యోగాల కోసం వెళ్లేవారే ఉంటారు. అంటే అందరూ ఉన్నత విద్యావంతులేనన్న మాట. అంత చదువుకుని, దేశాల మధ్య అలవోకగా ప్రయాణాలు సాగిస్తున్న వీరు ఎందుకిలా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, మానసిక నిపుణులు దీనికి చాలానే కారణాలు చెబుతున్నారు. విద్య, ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మద్యం వంటివి ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో విచక్షణ కోల్పోయేలా చేస్తుందని, ఇది మరిన్ని సమస్యలకు కారణం అవుతుందంటున్నారు.

విమానాల్లోనే మద్యం పంపిణీ..

విమాన ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు గల ప్రధాన కారణాల్లో మద్యం ఒకటన్నది కూడా నిజమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి విమాన సంస్థలు ప్రయాణికులకు మద్యం ఎందుకు పంపిణీ చేస్తాయన్న విషయంలో స్పష్టత లేదు. అయితే, విమానంలో తగినంత గాలి లేక అసౌకర్యంగా అనిపించడం, సుదీర్ఘ ప్రయాణం వంటివి తెలియకుండా ఉండేందుకు ప్రయాణికులకు మద్యాన్ని పంపిణీ చేస్తారు. దాని మోతాదు ఎక్కువైతేనే అసలు చిక్కంతా. అయితే, అది మరీ విచక్షణ కోల్పోయేంతగా ఉండదని కూడా నిపుణులు చెబుతున్నారు. నిజానికి విమానాల్లో జరుగుతున్న ఘటనల వెనక మద్యం ప్రభావం కంటే ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

మద్యం సరఫరాపై సమీక్ష

విమానంలో మూత్ర విసర్జన ఘటన తర్వాత ఎయిరిండియా తమ మద్యం పాలసీపై పునరాలోచనలో పడింది. విమానాల్లో మద్యం సరఫరా విధానాన్ని సమీక్షిస్తామని పేర్కొంది. అయితే, చాలా విమానయాన సంస్థలు మాత్రం ఇలాంటి నిర్ణయానికి ఇంకా రాలేకపోతున్నాయి.

ముగింపు ఎప్పుడు?

విమానాల్లో చిల్లర వేషాలకు మద్యమో, మరోటో కారణం సరే.. మరి వీటికి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది. పదేపదే జరిగే ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలకు కారణమేంటో తెలుసుకుని, అలాంటివి పునరావృతం కాకుండా ఎయిర్‌లైన్స్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకు అవసరమైతే మరిన్ని కఠన నిబంధనలు తీసుకురావాలని, ఈ విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చొరవ తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-03-06T19:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising