Viral photos: పండుగ పూట దొంగలకు వినూత్న సందేశం.. అతడి మంచితనాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు..
ABN, First Publish Date - 2023-01-14T18:03:39+05:30
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడెక్కడో ఉంటున్న తెలుగు వారంతా ఈ పండుగ నాడు తప్పకుండా సొంతూళ్లకు..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti festival) పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడెక్కడో ఉంటున్న తెలుగు వారంతా ఈ పండుగ నాడు తప్పకుండా సొంతూళ్లకు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఇదే సమయంలో ఇలాంటి పండుగలు దొంగలకూ ఎంతో అనుకూలంగా మారుతుంటాయి. ఖాళీ ఇళ్లను టార్గెట్ చేసి.. నగలు నగదును కొళ్లగొట్టడం తరచూ చూస్తూనే ఉంటాం. అందుకే సొంతూళ్లకు వెళ్లే వారికి పోలీసులు కూడా పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సంక్రాంతి సందర్భంగా ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా (Viral photo) మారింది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు పట్టణాలు, నగరాలు.. దాదాపుగా ఖాళీ అవుతుంటాయి. సొంతూళ్లకు వెళ్లే తొందరలో ఇళ్లల్లో నగలు, నగదును మర్చిపోయి వెళ్తుంటారు. ఇలాంటి వారి నిర్లక్ష్యం దొంగలకు (Thieves) అవకాశంగా మారుతుంటుంది. ఖాళీ ఇళ్లలోకి చొరబడి లూటీ (theft) చేసేస్తుంటారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లిన అతను.. తన ఇంటి తలుపుల మీద ఓ సందేశం రాసి వెళ్లాడు. ‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలు తీసుకుని పోతున్నాము. మా ఇంటికి రాకండి. ఇట్లు.. మీ శ్రేయోభిలాషి' అని రాసి, తాళం వేసుకుని వెళ్లాడు. ఈ ఫొటో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ సందేశం చూస్తే.. బుద్ధి ఉన్న వాడు ఎవడూ దొంగతనం చేయడు.. అంటూ కొందరు, మీ శ్రేయోలాభిలాషి అంటూ దొంగల పట్ల అతను చూపించిన ప్రేమను చూసి అంతా అభినందిస్తున్నారు.
Updated Date - 2023-01-14T18:03:49+05:30 IST