Union Budget 2023: కేంద్ర బడ్జెట్ గురించి చాలా మందికి తెలియని నిజాలివి..!
ABN, First Publish Date - 2023-02-01T13:06:10+05:30
ప్రభుత్వం ఒక ఏడాది కాలానికి చేయనున్న/చేయాల్సిన జమ, వ్యయాల సమాహారాన్నే 'బడ్జెట్'గా (Budget) పిలవడం జరుగుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వం ఒక ఏడాది కాలానికి చేయనున్న/చేయాల్సిన జమ, వ్యయాల సమాహారాన్నే 'బడ్జెట్'గా (Budget) పిలవడం జరుగుతుంది. ఇది 'బోగెట్టీ' అనే ఫ్రెంచీ పదం నుంచి వచ్చింది. దీని అసలు అర్థం మాత్రం 'తోలు సంచి'. రాజ్యాంగంలోని (Indian Constitution) ప్రకరణ 112 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా పార్లమెంట్‌లో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. అసలు ఈ బడ్జెట్ విధానం మన భారత్‌కు (India) ఎలా వచ్చింది? మన తొలి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? తదితర బడ్జెట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన, చాలా మందికి తెలియని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. స్వాతంత్ర్య్ భారతంలో తొలి బడ్జెట్‌ను (India's First Budget) కేంద్ర ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి (RK Shanmukham Chetty) 1947 నవంబర్ 26వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రకారం ఆదాయం రూ.171.15 కోట్లు, వ్యయం రూ.197.39 కోట్లు. ఇక ఈ బడ్జెట్‌ను సాయంత్రం 5గంటలకు ప్రవేశపెట్టారు.
2. ఇక స్వాతంత్ర్యానికి పూర్వం భారత్‌కు తొలి బడ్జెట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేమ్స్ విల్సన్ 1860, ఏప్రిల్ 7న ప్రకటించారు.
3. 1947 నుంచి ఇప్పటివరకు అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన మొత్తం 10సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
4. 2016 వరకు సపరేట్‌గా ఉన్న రైల్వే బడ్జెట్‌ను కాస్త 2017లో యూనియన్ బడ్జెట్‌లో విలీనం చేయడం జరిగింది.
5. ఇక సాధారణంగా బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ, బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు ఉన్నారనే విషయం మీకు తెలుసా? వారే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.
6. 1999 వరకు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన సాయంత్రం 5గంటల సమయానికే ప్రతియేటా బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అది కూడా ఫిబ్రవరి చివరి రోజున. కానీ, ఆ తర్వాత నుంచి తొలిసారి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
7. ఇక 2016 వరకు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉండేది. దీన్ని దివంగత మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2017లో ఫిబ్రవరి 1వ తేదీకి మార్చడం జరిగింది.
8. ఇక బడ్జెట్ గోప్యతను పాటిస్తూ, పద్దు మొత్తం పూర్తైన తర్వాత హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
9. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచే ఇప్పటివరకు లాంగెంస్ట్ స్పీచ్‌గా రికార్డులో ఉంది. ఈ బడ్జెట్‌లో ఆయన 18,650 పదాలు వినియోగించారట.
10. సమయం పరంగా చూస్తే మాత్రం 2020లో నిర్మలా సీతారామన్ ఏకంగా 2.42 గంటలు మాట్లాడారు.
11. 1950లో కేంద్ర బడ్జెట్ అనేది లీక్ అయింది. అది కూడా రాష్ట్రపతి భవన్‌లో ప్రిటింగ్ సమయంలో ఇది జరిగింది. దాంతో ప్రెస్‌ను న్యూఢిల్లీలోని మింట్ రోడ్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో ప్రభుత్వం నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో ప్రెస్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
12. ఇక మహమ్మారి కరోనా నేపథ్యంలో 2021లో నిర్మలా సీతారామన్ తొలి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి: దేశ తొలి బడ్జెట్ ఎంతో తెలుసా..? మొట్టమొదటి బడ్జెట్ విశేషాలివే..!
Updated Date - 2023-02-01T13:09:26+05:30 IST