Summer Drink: వేసవిలో మీ దాహార్తిని తీర్చే 4రకాల సంప్రదాయ కూల్ డ్రింక్స్
ABN, First Publish Date - 2023-04-17T18:50:56+05:30
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్, వేడిలో మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నీరు,ఇతర హైడ్రేటింగ్ ద్రవాలను తీసుకోవడం..
అసలే ఎండాకాలం..ఎండలు మండుతున్నాయి..ఇంట్లో ఉన్నా వేడిమి మీకు చిరాకు కలిగిస్తోంది. బయటకు వెళ్లొచ్చినమా..అంతే సంగతులు. వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్, వేడిలో మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నీరు,ఇతర హైడ్రేటింగ్ ద్రవాలను తీసుకోవడం చాలా అవసరం. ఇటువంటి హైడ్రేటింగ్ ద్రవాలు మనకు విరివిగా దొరుకుతున్నప్పటీకీ మన దాహార్తిని తీర్చుతూ మనల్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచే అనేక రకాల చల్లని పానీయాలు సాంప్రదాయ పద్ధతిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
1.పానకం(Panakam)
దీనినే పానగం అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే సాంప్రదాయ పానీయం. నీటిలో బెల్లం, నిమ్మరసం, అల్లం పొడి, మిరియాలు, యాలకుల కలిపి చేసి తయారు చేస్తారు. ఈ సువాసనగల పానీయాన్ని శ్రీరామనవమితో వేడుకల్లో భక్తులకు పంచుతారు. అయితే వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఇది ఒక పోషక మార్గం. పానగంలో సుగంధ ద్రవ్యాలు కలపడంతో కొంచెం తేడా ఉంటుంది. కానీ బెల్లం, నిమ్మకాయలు స్థిరంగా ఉంటాయి.
పానకం తయారీకి కావలసిన పదార్థాలు:
బెల్లం-3 కప్పులు, మిరియాల పొడి-3 టీ స్పూన్లు,ఉప్పు: చిటికెడు, నీరు:9 కప్పులు, శొంఠిపొడి: టీ స్పూన్, యాలకుల పొడి:టీ స్పూన్.
తయారీ విధానం:
ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచుకుని తర్వాత నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి వేసి బాగా కలపాలి. అంతే రాముడికి నైవేద్యం పెట్టడానికి పానకం రెడీ అయినట్లే..
2.లస్సీ(Lassi)
లస్సీ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వేసవి పానియాలలో ఒకటి. లస్సీని కేవలం మూడు పదార్థాలను ఉపయోగించి తయారు చేయవచ్చు. అవి పెరుగు, చల్లబడిన నీరు లేదా ఐస్ క్యూబ్స్, చక్కెర. కొందరు వ్యక్తులు తీపికి బదులుగా సాల్టీ వెర్షన్‌ను కూడా ఇష్టపడతారు. లస్సీని ప్రజలు అనేక రకాలుగా తయారు చేస్తుంటారు. లస్సీలలో మామిడి లస్సీ అత్యంత రుచికరమైన ప్లేవర్. ఇది సీజనల్ పండు అయిన మామిడిలో తియ్యదనాన్ని ఇందులో ఆస్వాదించవచ్చు.
మ్యాంగో పుదీనా లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు
2 మీడియం మామిడి పండ్లు, 2 కప్పుల ఐస్ క్యూబ్స్, 2 కప్పుల పెరుగు, 1/2 కప్పు చల్లని పాల
4 రెబ్బల పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తేనె, 1/4 కప్పు నారింజ రసం, 1/2 టీస్పూన్ ఏలకులు
మ్యాంగో పుదీనా లస్సీ తయారీ చేసే విధానం..
ముందుగా మామిడి పండ్లను, పుదీనా రెమ్మలను నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత మామిడి పండ్లు తొక్కతీసి.. ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి దీంట్లోనే పెరుగు, పాలు, ఏలకులు, నారింజ రసం, తేనె, ఐస్ క్యూబ్స్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. కాస్త పులుపు ఉన్నట్టైతే దీనికి షుగర్-ఫ్రీ చక్కెర కానీ తేనె కానీ కలపండి. ఆ తరువాత చక్కటి సీసం గ్లాసులో పోసి పైన పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయండి. అయితే మామిడిపండు ముక్కలు పూర్తిగా మెత్తగ అయిపోయేలా చూడాలి.
లస్సీ అంటే మజ్జిగ కర్రతో చిలకాలి. అప్పుడే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ నేటి బిజీ లైఫ్ లో అది సాధ్యమయ్యే విసయం కాదు. అంత సమయమూ కేటాయించలేరు. కాబట్టి మిక్సీలో చేసిన ఈ మాంగో పుదీనా లస్సీని ఎంజాయ్ చేయచ్చు. ఈ లస్సీ రుచి ఇంకా పెంచుకోవడానికి దీనికి కిస్ మిస్ కలిపితే ఇంకా బాగుంటుంది.
3. చాస్(మజ్జిగ)(Buttermilk):
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మజ్జిగ (లేదా) చాస్ విస్తృతంగా వినియోగిస్తారు. మహారాష్ట్ర ‘తక్’ అనేది సాధారణంగా జీరా పొడి, ఉంగరం పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, రాతి ఉప్పుతో కలిపిన మజ్జిగ. దక్షిణ భారతదేశంలో ‘నీర్ మోర్’ కూడా అదే విధంగా ఉంటుంది. వేసవిలో ఆనందించడానికి సాంప్రదాయ చాస్ రూపంలో అనేక రకాల పానియాలు వాడుకలో ఉన్నాయి. చాస్‌లో మసాలా చాస్, దోసకాయ చాస్, బీట్‌రూట్ చాస్ వంటి చాలా రకాలు తయారు చేసుకోవచ్చు.
కీరదోసకాయతో తయారుచేసే చాస్‌ని కూడా తాగితే..డీహైడ్రేషన్‌కి లోనుకాకుండా ఉంటారు. మరి కుకుంబర్ చాస్‌ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా..!
కావలిసిన పదార్థాలు:
కీరదోసకాయ-ఒకటి, పచ్చిమిర్చి-రెండు, మజ్జిగ-500ml, జీలకర్ర పొడి-అర టేబుల్ స్పూను, బ్లాక్ సాల్ట్ - అరటేబుల్‌స్పూను, ఉప్పు-అర టేబుల్ స్పూను, పుదీనా-రెండు లేదా మూడు, ఐస్-కొద్దిగా.
తయారుచేసే విధానం
కీరదోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీజార్‌లో వేసుకుని, పచ్చిమిర్చిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో మజ్జిగ వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో జీలకర్రపొడి, బ్లాక్ సాల్ట్, ఉప్పు, పుదీనా ఆకులు, కొద్దిగా ఐస్ వేసుకుని కలుపుకోవాలి. దీన్ని గ్లాస్‌ల్లో సర్వ్ చేసుకుని తాగితే.. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కీరదోసకాయ, మజ్జిగ ఉండడం వల్ల కూల్‌గా ఉంటుంది.
4. జల్‌జీరా(Jal Jeera)
‘జల్‌జీరా’ అనేది జీలకర్ర, చింతపండు, నిమ్మకాయ, పుదీనా, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, ఇతర పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ పానీయం తాగితే ఎంతో రీఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఎక్కువ మంది అమితంగా ఇష్టపడతారు. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జల్‌జీరా పానీయం తయారేు చేసుకుంటారు. జల్‌జీరా పానీయం నీటి ఆధారితమైనప్పటికీ కొందరు జీరా-ఫ్లేవర్ సోడాలను కూడా తయారు చేస్తుంటారు. జల్‌జీరా జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుందని అంటుంటారు. కాబట్టి దీనిని మీ వేసవి ఆహారంలో చేర్చుకోగల ఆరోగ్యకరమైన పానీయం. చల్లదనంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే డ్రింక్ జల్‌జీరా. ఇంట్లో లభించే పదార్థాలతో తయారుచేసుకోగలిగే ఈ డ్రింక్‌ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తాగుతారు.
జల్‌జీరా తయారీకి కావలసినవి:
పుదీనా-ఒక కట్ట, నిమ్మరసం-కొద్దిగా, ఉప్పు-రుచికి తగినంత, నీళ్లు-రెండు గ్లాసులు, జీలకర్ర-రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర-ఒక కట్ట, అల్లం-కొద్దిగా, పంచదార-నాలుగు టేబుల్‌స్పూన్లు, ఇంగువ-చిటికెడు, చింతపండు-కొద్దిగా.
తయారుచేయు విధానం
పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్రను వేగించాలి. మిక్సీలో పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి పట్టుకోవాలి. వేగించిన జీలకర్ర, అల్లం ముక్క వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇంగువ, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి, నీళ్లు పోసి మరోసారి పట్టుకోవాలి. సన్నటి జాలీతో వడబోసి, ఐస్‌క్యూబ్‌లు వేసి చల్లగా సర్వ్ చేయాలి.
Updated Date - 2023-04-17T18:50:56+05:30 IST