కోటి రూపాయల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేసిన 80 ఏళ్ల వృద్ధుడు.. నా అంత్యక్రియలు కూడా నా పిల్లలు చేయకూడదంటూ..
ABN, First Publish Date - 2023-03-07T12:35:35+05:30
ఆరుగురు పిల్లలు కలిగిన ఈ వృద్దుడు ఎందుకిలా చేశాడనే విషయం దేశం యావత్తు చర్చనీయాంశంగా మారింది.
లక్షల కొద్దీ ఆస్తి చూస్తేనే కళ్ళు బైర్లు కమ్ముతాయి సగటు మనిషికి. అలాంటిది ఏకంగా కోటి రూపాయలకు పైగా ఆస్తిని ప్రభుత్వానికి రాసి రాష్ట్ర గవర్నర్ కు ఇచ్చాడు 80సంవత్సరాల వృద్దుడు. ఈయన చేసిన పని ఇప్పుడు దేశం యావత్తు చర్చనీయాంశంగా మారింది. ఆరుగురు పిల్లలు కలిగిన ఈ వృద్దుడు ఎందుకిలా చేశాడనే విషయం వివరంగా తెలుసుకుంటే..
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ముజఫర్ నగర్(Muzaffarnagar) జిల్లాలో బుధానా పంచాయితీ(Budhana Panchayat) పరిధిలో 80 ఏళ్ళ నాథూ సింగ్ అనే వృద్దుడు నివసిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు. పిల్లలందరి పెళ్ళిళ్ళు ఎంతో ఘనంగా చేశాడు. వీరిలో ఒక కొడుకు చనిపోగా మరొక కొడుకు ప్రభుత్వ పాఠశాల టీచర్ గా పనిచేస్తున్నాడు.నాథూ సింగ్ భార్య 20ఏళ్ళ క్రితమే చనిపోయింది. అప్పటి నుండి కొడుకు కోడలితో కలసి ఉంటున్నాడు. ఈయన కోడలిని కూడా కూతురులా చూసుకునేవాడు. కానీ కోడలే ఈయనకు కూతురు కాలేకపోయింది. ఎప్పుడూ విసిగించుకోవడం, తిట్టడం, ఆహరం సరిగా పెట్టకుండా నాథూ సింగ్ కడుపు మాడ్చడం చేసేది. నాథూ కొడుకు కూడా భార్య మాటను జవదాటేవాడు కాదు.తండ్రిని ఎప్పుడూ హింసిస్తూ ఉండేవాడు. కొడుకు, కోడలు ఇలా చేస్తున్నా నాథూ సింగ్ సర్దుకుపోయాడు తప్ప వాళ్లను ఏమీ అనలేదు. ఆకలేస్తే తనే రొట్టెలు చేసుకునేవాడు. కానీ వాటిని కూడా అందుబాటులో లేకుండా చేసేది కోడలు.
ఒకరోజు నాథూసింగ్ గదిలో ఉండగా కొడుకు, కోడలు ఇద్దరూ గదిలోకి వచ్చి నాథూ సింగ్ ను బలవంతంగా పట్టుకుని గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించారు. నాథూ సింగ్ ఎలాగోలా విడిపించుకుని బయటపడ్డాడు. అప్పటి నుండి దగ్గరలో ఉన్న ఓ వృద్దాశ్రమంలో ఉంటున్నాడు. కొడుకు కోడలు చేసిన పనికి నాథూ సింగ్ మానసికంగా కుంగిపోయాడు. అతనిలో కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. వారికి సరైన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు. నాథూ సింగ్ పేరు మీద ఒక ఇల్లు సుమారు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. అది కోటి రూపాయలకు పైనే విలువ చేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి రాసిచ్చాడు నాథూ సింగ్. దాన్ని గవర్నన్ కు అందజేశాడు. అంతే కాదు తను చనిపోతే తన మృతదేహానికి అంత్యక్రియలు కూడా కొడుకు చేయడానికి వీల్లేదని తన వీలునామాలో పేర్కొన్నాడు. తన పిల్లలు ఎవరూ తన మృతదేహాన్ని తాకకూడదనే షరతు అందులో నమోదు చేశాడు. నాథూ సింగ్ నిర్ణయం విన్నవారు 'ఆ తండ్రి మనసు ఎంత విరిగిపోతే తప్ప అంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. మొత్తానికి అలాంటి కొడుకులు ఉన్నవారు ఇలానే నిర్ణయం తీసుకోవాలి. పిల్లల చేతుల్లో నిర్లక్ష్యం అవుతున్న తల్లిదండ్రులకు నాథూ సింగ్ గొప్ప ప్రేరణ అవుతాడు' అని అంటున్నారు. నాథూ సింగ్ మరణం తరువాత ఆయన వీలునామా అమలవుతుందని సబ్-రిజిస్టార్ కార్యాలయ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-03-07T12:35:35+05:30 IST