Factcheck: భారీ సొర చేప దాడితో రెండు ముక్కలైన నౌక.. వైరల్ వీడియోతో జనాల్లో ఆందోళన..
ABN, First Publish Date - 2023-04-17T14:45:39+05:30
భారీ సొర చేప దాడితో రెండు ముక్కలైన నౌక.. వైరల్ వీడియోతో జనాల్లో ఆందోళన..
ఎన్నారై డెస్క్: అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక్కసారిగా కలకలం. సముద్రపులోతుల్లోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఓ సొర చేప ఓ నావపై దాడికి దిగింది. ఒక్క దెబ్బతో ఆ నావను రెండు ముక్కలు చేసింది. ఆ పక్కనే ఉన్న మరోనావలోని వ్యక్తి ఇదంతా రికార్డు చేశాడు. ఇంతలోనే ఆ నావ కూడా సముద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఇది. ఈ దాడి కెనడాలో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంత భారీ ప్రమాదం ఎలా జరిగిందంటూ అనేక మంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. దీంతో.. అంతర్జాతీయ మీడియా దృష్టి కూడా ఈ వీడియోపై పడింది. ఈ క్రమంలో వీడియో కనిపించింది వాస్తావమో కల్పితమో తేల్చేందుకు రంగంలోకి దిగగా అదంతా గ్రాఫిక్స్ అని తేలిపోయింది. కంప్యూటర్ త్రీడీ యానిమేషన్ సాయంతో దీన్ని రూపొందించారని అని వెల్లడైంది. గొప్ప సాంకేతిక విలువలతో ఈ వీడియో రూపొందించడంతో నెటిజన్లు ఇదంతా నిజమనుకుని భయభ్రాంతులకు లోనైనట్టు రుజువైంది. అయితే.. వీడియో ఫేక్ అని తేలినా క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉందంటూ కొందరు అభిప్రాయపడటం గమనార్హం.
అయితే.. ఇలాంటి వీడియోలు వైరల్ అవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు వీడియోలు ఇలాగే కలకలం రేపాయి. ఈ క్రమంలో నెటిజన్లే నిజనిర్ధారణకు పూనుకునేవారు. తమకు నెట్టింట దొరికిన సమాచారాన్ని ఈ వీడియోలకు కామెంట్స్ రూపంలో షేర్ చేస్తూ నిజానిజాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేవారు. అయితే..స్మార్ట్ ఫోన్ వినియోగం ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ వీడియోల కట్టడి కోసం మీడియా సంస్థల డిజిటల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగుతున్నాయి. గూగుల్ అందించే పలు టూల్స్ సాయంతో ఫ్యాక్ట్ చెక్ పేరిట వాస్తవాలను వెలుగులోకి తెస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
Updated Date - 2023-04-18T19:53:44+05:30 IST