Viral Video: రోడ్డు పక్కన చెత్త ఏరుకునే వ్యక్తి.. పక్కనే ఓ కుక్క.. ఓ దర్శకుడు అనుమానంతో సీక్రెట్‌గా ఫాలో అయితే..!
ABN, First Publish Date - 2023-12-08T13:42:26+05:30
ఓ సినీ దర్శకుడు రాత్రి సమయంలో ఓ నిరాశ్రయుడి జీవితంలో కొన్ని క్షణాలను రహస్యంగా బంధించిన వీడియో..
మనుషులకు దగ్గరగా ఉండే జంతువులలో కుక్క మొదటి స్థానంలో ఉంటుంది. దాని విశ్వాసం, యజమాని పట్ల అది చూపించే కృతజ్ఞత చాలా గొప్పది. వాటికి ధనిక, పేద అనే తేడాలుండవు. తాము తినే ఆహారంలో ఓ ముద్ద వాటికి పెడితే ఎనలేని ప్రేమ చూపిస్తాయి.రోడ్ల మీద చెత్త ఏరుకుంటున్న ఆశ్రయం లేని ఓ వ్యక్తి, అతని వెంట నీడలాగా నడుస్తున్న ఓ కుక్క.. ఓ సినీ దర్శకుడి కంట పడింది. వీరిని చూసి సినీ దర్శకుడు సీక్రెట్ గా ఫాలో అయ్యాడు. వారిద్దరి జీవితాన్ని నిశ్శబ్దంగా తన కెమెరాలో బంధించాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు. 'ఈ ప్రపంచంలో అతను నిజమైన ధనవంతుడు' అని అంటున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
కుక్కలకు మనుషులకు మధ్య చాలా గొప్ప స్నేహం, అంతకు మించి అనుబంధం ఉంటుంది. సోషల్ మీడియాలో వీటికి సంబంధించి బోలెడు వీడియోలు కూడా ఉంటాయి. ఓ సినీ దర్శకుడు రాత్రి సమయంలో ఓ నిరాశ్రయుడి జీవితంలో కొన్ని క్షణాలను రహస్యంగా బంధించిన ఈ వీడియో మాత్రం చాలా ప్రత్యేకం. చిత్రనిర్మాత, రచయిత, సినీ దర్శకుడు వినోద్ కప్రి ఓ వీడియో షేర్ చేశారు. వీడియో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నోకు చెందినది. లక్నోలో తెల్లవారు జాము 3:15 నిమిషాలప్పుడు ఆశ్రయం లేని ఓ వ్యక్తి రోడ్లమీద చెత్త ఏరుకుంటూ నడవడం కనిపిస్తుంది. అతని వెన్నంటి నీడలాగా ఓ కుక్క కూడా ఉంది. అతను ఎక్కడైనా ఆగగానే అది కూడా ఆగుతుంది. అతను నడవడం మొదలెట్టగానే అది కూడా నడుస్తుంది. ఇలా రహదారి అంతా తిరుగుతూ అతను చెత్త ఏరుకుంటున్నాడు. ఇదే సమయంలో సినీ దర్శకుడు కప్రీ అతని పక్కన కారు ఆపి రూ. 500నోటును అతనికి ఇస్తాడు. అతని గురించి, అతని కుక్క గురించి వాకబు చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి తన కథంతా చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: నిమ్మకాయల గురించి మీకు తెలియని నిజాలు..!
అతని పేరు షకీల్ అని చెత్త ఏరుకునే వ్యక్తి చెప్పాడు. అతను పెంచుకుంటున్న కుక్క పేరు కల్లు. షకీల్ బహ్రైచ్‌లోని భూస్వామి కుటుంబానికి చెందినవాడు. కాని అతని తండ్రి రెండవ వివాహం తరువాత మొదటి భార్య కొడుకులైన షకీల్ ను అతని తమ్మున్ని పట్టించుకోకుండా వదిలేశాడు. షకీల్ తమ్ముడు ఎక్కడున్నాడో అతనికి తెలియదు. తండ్రి వదిలేసిన తరువాత ఫుట్ పాతే షకీల్ నివాసం అయ్యింది. అయతే షకీల్ ఒంటరివాడైనప్పటికీ కల్లు వల్ల అతనికి ఆ లోటు తెలియడం లేదు. కల్లును అతను బాధ్యతగా చూసుకోవమే కాదు.. కల్లు కూడా అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. రోజూ అతని వెంటే ఉంటుంది. షకీల్, కల్లు ఇద్దరూ కలసి చెత్త సేకరిస్తారు, ఇద్దరూ కలిసే ఆహారం తింటారు. రాత్రి పడుకున్నప్పుడు ఇద్దరూ కలిసి ఒకే దుప్పట్లో నిద్రిస్తారు కూడా. పైపెచ్చు ఉదయం కాగానే కల్లు షకీల్ ను తట్టి మరీ నిద్రలేపుతుందట. ఈ విషయం మొత్తాన్ని షకీల్, దర్శకుడు కప్రీతో పంచుకున్నాడు. అనంతరం కప్రీ షకీల్ కు కొన్ని తినుబండారాలు కూడా ఇస్తాడు. 6.51నిమిషాల ఈ వీడియో ఓ చిన్న డాక్యుమెంటరీలాగా అనిపిస్తోంది.
ఈ వీడియోను Vinod Kapri తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. 'కల్లు షకీల్ వద్ద ఉన్నాడు. షకీల్ యోగి ఆదిత్యనాథ్ వద్ద ఉన్నాడు. ఇతనికి న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది' అంటూ యోగి ఆదిత్యనాథ్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. 'ప్రతి వ్యక్తి వెనుక చాలా కథలుంటాయి సరియైనదేనా?' అంటూ క్యాప్షన్ చివరన పొందుపరిచాడు. ఓ సినీ దర్శకుడు షేర్ చేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. షకీల్, కల్లుల జీవితాన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ అవుతున్నారు. 'మీ ట్వీట్ జీవితంతో నిండిపోయింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను నిజమైన ధనవంతుడు' అని మరొకరు స్పందించారు. 'జంతువుల నుండి లభించే ప్రేమ, కృతజ్ఞత, నమ్మకం ఇంకెవరి దగ్గరా దొరకదు' అని ఇంకొకరు స్పందించారు.
ఇది కూడా చదవండి: Bride: అత్తారింటికి వెళ్తుండగా సడన్‌గా కారును ఆపమన్న వధువు.. ఈ భర్త నాకొద్దంటూ తిరిగి పుట్టింటికి.. అసలేం జరిగిందంటే..!
Updated Date - 2023-12-08T13:42:28+05:30 IST