NZ vs Srilanka : ఆఖరి బంతికి అద్భుతం
ABN, First Publish Date - 2023-03-14T04:42:48+05:30
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి న్యూజిలాండ్ విజయాన్ని అందుకొంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్ రెండు వికెట్లతో చిరస్మరణీయ గెలుపును నమోదు చేసింది.
లంకపై కివీస్ గెలుపు
క్రైస్ట్‌చర్చ్: ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి న్యూజిలాండ్ విజయాన్ని అందుకొంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్ రెండు వికెట్లతో చిరస్మరణీయ గెలుపును నమోదు చేసింది. నెగ్గాలంటే ఆఖరి బంతికి ఒక పరుగు అవసరమవగా.. నాటకీయ పరిణామాల మధ్య కేన్ విలియమ్సన్ (121 నాటౌట్), నీల్ వాగ్నర్ (0 నాటౌట్) ‘బె’ౖను దొంగిలించి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. 285 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 28/1తో మ్యాచ్‌కు ఆఖరిరోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ సరిగ్గా 285/8 స్కోరు చేసి వహ్‌వా అనిపించింది. చివరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి ఉండగా.. అసిత ఫెర్నాండో (3/63) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ శిబిరంలో గుబులు రేపాడు. తొలి 3 బంతుల్లో 3 పరుగులు రాగా.. హెన్రీ (4) రనౌటయ్యాడు.
నాలుగో బంతికి విలియమ్సన్ ఫోర్ కొట్టి స్కోరు సమం చేశాడు. అయితే, ఐదో బంతికి బౌన్సర్ వేసిన ఫెర్నాండో పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఇక, ఆఖరి బంతిని కూడా బౌన్సర్ వేసినా.. కివీస్ బ్యాటర్లు సింగిల్ తీయడంతో లంకకు నిరాశ తప్పలేదు. శ్రీలంక 355, 302 స్కోర్లు చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది.
Updated Date - 2023-03-14T04:42:48+05:30 IST