Delhi tes: జడేజా మాయాజాలం.. 7 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన జడ్డూ! భారత్ ముందు ఈజీ టార్గెట్..
ABN, First Publish Date - 2023-02-19T11:33:21+05:30
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మెరిశారు...
ఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మెరిశారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం చేశాడు. ఏకంగా 7 వికెట్లతో చెలరేగి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో జడేజా, అశ్విన్ చెలరేగారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 3 వికెట్లు తీశాడు. విజయానికి 114 పరుగుల లక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చారు. కేవలం 6 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు భారత్ స్కోర్ 14/1గా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న ఈ పిచ్‌పై ఆసీస్ బౌలర్లను భారత బ్యాటర్లు ఏవిధంగా ఎదుర్కొంటారో వేచూడాలి. లక్ష్యం చిన్నదే అయినా ఆసీస్ బౌలర్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
రెండో రోజు ఆట జరిగిందిలా...
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు శనివారం ఆటలో ఆసీస్ బౌలర్లు భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ నాథన్ లియాన్ (5/67) ఈసారి లయ అందుకున్నాడు. అయితే భారత లోయరార్డర్‌లో అద్భుత పోరాటం కనిపించింది. కష్టాల్లో పడిన జట్టును స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (74), రవిచంద్రన్ అశ్విన్ (37) ఆదుకున్నారు. విరాట్ కోహ్లీ (44), రోహిత్ (32) ఫర్వాలేదనిపించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.3 ఓవర్లలో 262 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఒక్క పరుగు ఆధిక్యంతో సంతృప్తి పడింది. ఆ తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ ఖవాజా (6)ను జడేజా అవుట్ చేసినా ట్రావిస్ హెడ్ (39 బ్యాటింగ్) వేగం కనబరిచాడు. అతడికి జతగా లబుషేన్ (16 బ్యాటింగ్) ఉండడంతో ఆసీస్ వికెట్ నష్టానికి 61 రన్స్ చేసింది. ప్రస్తుతం పర్యాటక జట్టు 62 పరుగుల ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-02-19T14:45:43+05:30 IST