AFG VS NED: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం.. రంజుగా మారిన సెమీస్ రేసు
ABN, First Publish Date - 2023-11-03T21:09:42+05:30
లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శుక్రవారం లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను సమం చేసింది. న్యూజిలాండ్‌కు నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో ఆప్ఘనిస్తాన్ ఐదో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా సెమీస్ రేసు రంజుగా మారింది. ఇప్పటికే టీమిండియా సెమీస్‌కు అర్హత సాధించగా.. దక్షిణాఫ్రికా రెండో బెర్త్ కైవసం చేసుకోనుంది. ఆస్ట్రేలియాకు 85 శాతం, న్యూజిలాండ్‌కు 60 శాతం సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్‌కు 40 శాతం, పాకిస్థాన్‌కు 25 శాతం మాత్రమే సెమీస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌కు సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. మరోవైపు తాజా విజయంతో 2025లో పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆప్ఘనిస్తాన్ అర్హత సాధించింది.
కాగా లక్నోలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 6.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఎంగెల్ బ్రెచ్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 27 పరుగుల వద్ద గుర్భాజ్ వికెట్‌ను కోల్పోయింది. అయితే ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న రహ్మత్ షా మరోసారి నిలకడ ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో తన జట్టును విజయ తీరాల వైపు నడిపించాడు. 54 బాల్స్‌లో 8 ఫోర్లతో అతడు 52 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సహకారం అందించాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 64 బాల్స్‌లో 6 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. దీంతో 31.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆప్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించింది.
Updated Date - 2023-11-03T21:13:51+05:30 IST