AUS vs AFG: ఒంటిచేత్తో ఆస్ట్రేలియాని గెలిపించిన మ్యాక్స్‌వెల్.. ఆఫ్ఘన్ ఆశలన్నీ బుగ్గిపాలు
ABN, First Publish Date - 2023-11-07T22:34:55+05:30
గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇతడ్ని డేంజరస్ ఆటగాడిగా పరిగణిస్తుంటారు. అలా ఎందుకంటారో తాజాగా మరోసారి నిరూపితమైంది. త్వరగా వికెట్లు కోల్పోయి, తన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతగాడు..
గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇతడ్ని డేంజరస్ ఆటగాడిగా పరిగణిస్తుంటారు. అలా ఎందుకంటారో తాజాగా మరోసారి నిరూపితమైంది. త్వరగా వికెట్లు కోల్పోయి, తన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతగాడు.. ఒంటిచేత్తో పోరాడి తన జట్టుకి ఘనవిజయం అందించాడు. తానొక్కడే 128 బంతుల్లో 201 (నాటౌట్) పరుగులు చేశాడంటే.. ఏ రేంజ్‌లో విజృంభించాడో మీరే అర్థం చేసుకోండి. ఎడాపెడా షాట్లతో మైదానంలో బౌండరీల వర్షం కురిపించి.. ఆఫ్ఘన్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేశాడు. అతని కాలికి గాయమైనా, పరుగులు పెట్టలేని స్థితిలో ఉన్నా, జట్టు కష్టాల్లో ఉన్నా.. ఒత్తిడికి గురవ్వకుండా అదేదో బఠానీలు నమిలినంత ఈజీగా బౌండరీలు బాదేశాడు. ఆఫ్ఘన్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని అతడు లాగేసుకున్నాడు.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. ఆప్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జాద్రాన్ (129 నాటౌట్) శతకంతో రాణించడం, చివర్లో రషీద్ ఖాన్ (35) మెరుపులు మెరిపించడం, ఇతర బ్యాటర్లు కాస్త పర్వాలేదనిపించడంతో.. ఆఫ్ఘన్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి అఖండ విజయాన్ని నమోదు చేసింది. నిజానికి.. ఆస్ట్రేలియా జట్టు మొదట్లో ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. దాదాపు ప్రధాన ఆటగాళ్లందరూ ఔట్ అవ్వడంతో.. ఆఫ్ఘన్ జట్టు చాలా ఈజీగా ఈ మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. బహుశా ఆఫ్ఘన్ ఆటగాళ్లు కూడా అలాగే అనుకొని ఉంటారు.
కానీ.. మ్యాక్స్‌వెల్ ఆ అంచనాల్ని తిప్పికొడుతూ, ఒంటిచేత్తో పోరాటం చేసి, మలుపు తిప్పేశాడు. నేనున్నానంటూ మైదానంలో తాండవం చేశాడు. అతడ్ని ఔట్ చేసేందుకు ఆఫ్ఘన్ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా సరే.. ప్రయోజనం లేకుండా పోయింది. క్లిష్టమైన బంతుల్ని సైతం అతడు తనకు అనుకూలంగా మార్చుకొని, తన విశ్వరూపం చూపించాడు. నిజానికి.. మ్యాక్స్‌వెల్ మొదట్లోనే ఔట్ అవ్వాల్సింది. అతడు రెండు క్యాచ్‌లు ఇచ్చాడు. కానీ.. ఆఫ్ఘన్ ఫీల్డర్లు ఆ క్యాచ్‌లను అందుకోలేకపోయారు. ముఖ్యంగా.. నబీకి ఈజీ క్యాచ్ వచ్చినా, అతడు పట్టుకోలేకపోయాడు. అదే అఫ్ఘన్ పాలిట శాపమైంది. మ్యాక్స్‌వెల్‌కి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. అంతేకాదు.. 200 చేసిన అతికొద్ది మంది జాబితాలోనూ అతడు చేరిపోయాడు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆఫ్ఘన్ టాప్-4లో చేరేది. కానీ.. ఇప్పుడు సెమీస్ ఆశలు కష్టతరంగా మారాయి.
Updated Date - 2023-11-07T22:34:57+05:30 IST