Babar Azam: ‘మేం ఇది అస్సలు ఊహించలేదు’.. భారత్ ఆతిథ్యంపై బాబర్ కామెంట్స్
ABN, First Publish Date - 2023-11-13T20:59:10+05:30
Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంటుంది. కానీ.. పాకిస్థానీయులంతా అలాగే ఉండరు. భారత్‌పై తమ అభిమానం...
భారత్, పాకిస్థాన్ మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంటుంది. కానీ.. పాకిస్థానీయులంతా అలాగే ఉండరు. భారత్‌పై తమ అభిమానం, ప్రేమను ఒలకబోసే వ్యక్తులూ ఉన్నారు. అలాంటి వారిలో పాక్ ఆటగాడు బాబర్ ఆజాం కూడా ఒకడు. క్రీడాపరంగా అప్పుడప్పుడు విమర్శలు గుప్పించొచ్చు కానీ.. రియాలిటీలో మాత్రం భారత్‌పై తన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు. భారత్ ఆతిథ్యంపై తాజాగా అతడు కురిపించిన ప్రశంసలే అందుకు సాక్ష్యం.
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన తమకు అపూర్వ స్వాగతం లభించిందని, ఆతిథ్యం అద్భుతంగా ఉందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కొనియాడాడు. తాము తొలిసారి భారత్‌కి వచ్చినా.. త్వరగానే ఇక్కడి పరిస్థతులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తనతో పాటు తన జట్టులోని ప్రతీ ఒక్కరికీ అభిమానుల నుంచి ప్రేమ, మద్దతు లభించాయన్నాడు. తమకు ఇలాంటి ఆదరణ దక్కుతుందని ఊహించలేకపోయామని పేర్కొన్నాడు. కానీ.. టోర్నీలో సరిగ్గా రాణించలేకపోయాయని, అందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయానని ఒప్పుకున్నాడు. తనకు అర్థశతకాలు, శతకాలు ముఖ్యం కాదని.. జట్టును గెలిపించడమే ముఖ్యమన్నాడు. తాను నెమ్మదిగా ఆడినా, వేగంగా ఆడినా.. అది పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుందన్నాడు. మిడిల్ ఓవర్లతోపాటు చివర్లో తాము పరుగులు రాబట్టాల్సిందని చెప్పాడు. బంతి పాత బడిన తర్వాత పరుగులు చేయడం కష్టమవుతుందని, ఇలాంటి అనుభవాల్ని గతంలోనూ చవిచూశామని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా.. ఈ వరల్డ్‌కప్‌లో బాబర్ ఆజామ్ పెద్దగా రాణించకపోవడంతో, అతనిపై విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనికి పాకిస్థాన్ డైరెక్టర్ మికీ ఆర్థర్ మద్దతుగా నిలిచాడు. ఇంకా అతడు నేర్చుకొనే దశలోనే ఉన్నాడని, ఈ ప్రయాణం అతనికెంతో కలిసి వస్తుందని చెప్పాడు. బాబర్ నిజంగా అద్భుతమైన బ్యాటర్ అని, నాయకత్వంలో అతడు మెరుగవుతూనే ఉన్నాడని, అతనికి ఇంకా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు ఎన్నో పొరపాట్లు చేసిన విషయం వాస్తవమేనని, ఆ తప్పుల నుంచి జట్టు తప్పకుండా గుణపాఠం నేర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. విమర్శల్ని పట్టించుకోకుండా.. ఆటలో మెరుగు అవ్వడంపై దృష్టి సారించాలని సూచించారు.
Updated Date - 2023-11-13T20:59:11+05:30 IST