IPL2023: ఐపీఎల్ ప్రారంభానికి 2 రోజుల ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌కి బ్యాడ్‌న్యూస్ !
ABN, First Publish Date - 2023-03-28T18:50:37+05:30
ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL
చెన్నై: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐపీఎల్‌లో ప్రారంభంలో కొన్ని మ్యాచుల్లో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు.
గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో స్టోక్స్(Ben Stokes)ను చెన్నై రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ జట్టు ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించిన సమయంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం 31 ఏళ్ల స్టోక్స్ మాట్లాడుతూ.. తాను అబద్దం చెప్పాలనుకోవడం లేదని, కోరుకున్నట్టుగా ప్రదర్శన చేయకుండా ఏదో తనను వెనక్కి లాగుతోందని, ఇది తనను తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పుకొచ్చాడు.
ఎడమ మోకాలికి గాయంతో బాధపడుతున్న స్టోక్స్ యాషెస్ సిరీస్‌కు ముందు కార్టిసోన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఐపీఎల్‌లో బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని సమాచారం. జూన్‌లో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అతడిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఇంగ్లండ్ బోర్డు వైద్య సిబ్బంది, చెన్నై సూపర్ కింగ్స్ వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ హస్సీ కూడా ధ్రువీకరించాడు.
స్టోక్స్ ముందు బ్యాటింగ్‌తోనే ఐపీఎల్‌ను ప్రారంభిస్తాడని, అతడి బౌలింగ్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతానికైతే అతడు బ్యాటింగ్ మాత్రమే చేయగలడని, ఇది వందశాతం పక్కా అని అన్నారు. అయితే, టోర్నీలో ఏదో ఒక దశలో అతడి బౌలింగును మనం చూడగలుగుతామని హస్సీ అన్నాడు.
Updated Date - 2023-03-28T20:14:40+05:30 IST