BAN vs SL: బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం.. రాణించిన శాంతో, షకీబ్ అల్ హసన్
ABN, First Publish Date - 2023-11-06T22:20:19+05:30
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మిగిలి ఉండగానే బంగ్లా (282) జట్టు ఛేధించింది.
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మిగిలి ఉండగానే బంగ్లా (282) జట్టు ఛేధించింది. శాంతో (90), షకీబ్ అల్ హసన్ (82) అద్భుతంగా రాణించడం వల్లే.. బంగ్లా ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. మొదట్లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయగలిగారు కానీ.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో.. శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. శ్రీలంక బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. అసలంక (108) శతక్కొట్టగా.. నిస్సాంకా (41), సమరవిక్రమ (41), డీ సిల్వా (34) పర్వాలేదనిపించారు. మాథ్యూస్ టౌమ్డ్ ఔట్ అవ్వగా, మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 41.1 ఓవర్లలోనే 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలుపొందింది. మొదట్లో లంక బౌలర్ల ధాటికి 41 పరుగులకే బంగ్లా జట్టు 2 వికెట్లు కోల్పోయింది.
అప్పుడు శాంతో, షకీబ్ ఉన్నతమైన ఇన్నింగ్స్ ఆడి.. తమ జట్టుని ఆదుకున్నారు. మూడో వికెట్‌కి వీళ్లు ఏకంగా 169 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీళ్లు కనబర్చిన ఈ అద్భుత ప్రదర్శన పుణ్యమా అని.. బంగ్లా జట్టు విజయం సాధించగలిగింది. చివర్లో వెనువెంటనే వికెట్లు పడినా.. అప్పటికే బంగ్లా లక్ష్యానికి చేరువలో ఉండటంతో, సునాయాసంగా ఛేధించగలిగింది. బంగ్లాదేశ్ జట్టు తరఫున షకీబ్ అల్ హసన్ హీరోగా నిలిచాడు. 65 బంతుల్లోనే 82 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.
అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అదే.. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అవ్వడం. రూల్స్ ప్రకారం.. ఒక వికెట్ పడిన తర్వాత లేదా బ్యాటర్ రిటైర్‌మెంట్ ప్రకటించాక తదుపరి బ్యాటర్ మూడు నిమిషాల లోపే క్రీజులో బంతిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ.. హెల్మెట్ ఇబ్బంది పెట్టడంతో మాథ్యూస్‌కి ఆలస్యం అయ్యింది. దీంతో.. బంగ్లా జట్టు టైమ్డ్ ఔట్ అప్పీల్ చేయగా, అంపైర్ అతడ్ని వెనక్కు పంపించేశారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఔట్ నమోదవ్వడం ఇదే తొలిసారి.
Updated Date - 2023-11-06T22:20:21+05:30 IST