ICC Womens T20 World Cup 2023: బిస్మా కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ ఎదుట భారీ లక్ష్యం!
ABN, First Publish Date - 2023-02-12T20:26:56+05:30
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్(ICC Womens T20 World Cup 2023)లో
కేప్‌టౌన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్(ICC Womens T20 World Cup 2023)లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 43 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది.
అయితే, కెప్టెన్ బిస్మా మరూఫ్ చక్కని బ్యాటింగ్‌తో వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అంతేకాదు, 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 పరుగులు చేసి జట్టును నిలబెట్టింది. అయేషా నసీమ్ వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝళిపించింది. జోరుగా బ్యాటింగ్ చేస్తూ జట్టు స్కోరును పరుగులు పెట్టించింది. బిస్మా, అయేషాలు కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు.
ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. బౌలర్లను మార్చిమార్చి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అయేషా, 68 పరుగులు చేసిన మరూఫ్ నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు తీసింది.
Updated Date - 2023-02-12T20:26:57+05:30 IST