IND vs NED: లీగ్ దశలో ఇండియా క్లీన్ స్వీప్.. నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
ABN, First Publish Date - 2023-11-12T22:10:40+05:30
World Cup 2023: ఆదివారం (12-11-23) బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు ఛేధించలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 250 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆదివారం (12-11-23) బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు ఛేధించలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 250 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. భారత్ 160 పరుగుల తేడాతో అఖండ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. దీంతో.. లీగ్ దశలో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది విజయాలు నమోదు చేసి క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో విశేషం ఏమిటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బౌలింగ్ వేయడమే కాదు.. చెరో వికెట్ కూడా తీసుకున్నారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. టాప్-5 బ్యాటర్లలో రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) అర్థశతకాలతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) శతకాలతో విధ్వంసం సృష్టించారు. అందుకే.. టీమిండియా అంత భారీ స్కోరు చేయగలిగింది. టాప్-5 ఆటగాళ్లు ఇలా 50కి పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి. దీంతో.. భారత్ ఖాతాలో ఆల్‌టైం రికార్డ్ చేరింది. ఇక 411 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు.. 47.5 ఓవర్లలో 250 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో తేజ నిడమనూరు (54) అర్థశతకంతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైబ్రాండ్ 45 పరుగులతో రాణించాడు.
ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అయితే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీసిన చెరో వికెట్ల గురించే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక దశలో.. అంటే ప్రధాన బౌలర్లతోనే కెప్టెన్ రోహిత్ బౌలింగ్ వేయిస్తున్నప్పుడు మైదానంలో నుంచి అభిమానులు కోహ్లీతో బౌలింగ్ వేయించాలని కోరారు. ఎలాగో విజయం తథ్యం కావడంతో.. రోహిత్ శర్మ కోహ్లీతో బౌలింగ్ వేయించాడు. అతను స్కాట్ ఎడ్‌వర్డ్స్ వికెట్ తీయగానే, మైదానం మొత్తం హోరెత్తిపోయింది. అనుష్క సైతం ఎగ్జైటింగ్‌తో ఎగిరి గంతులేసింది. ఇక చివర్లో రోహిత్ వికెట్ తీసినప్పుడు కూడా మైదానంలో అలాంటి సంబరాలే కనిపించాయి. అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. శ్రేయస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్‌ని గెలుపొందాడు.
Updated Date - 2023-11-12T22:10:42+05:30 IST