IPL 2023: రుతురాజ్ గైక్వాడ్ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?
ABN, First Publish Date - 2023-03-31T21:40:24+05:30
ఐపీఎల్(IPL 2023) తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత మజా దొరికింది. డిఫెండింగ్
అహ్మదాబాద్: ఐపీఎల్(IPL 2023) తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత మజా దొరికింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సుడిగాలి ఇన్నింగ్స్ చూసి పశ్చాత్తాపం చెంది ఉంటాడు. గైక్వాడ్ బంతులను యథేచ్ఛగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే గుజరాత్ ప్లేయర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు.
14 పరుగుల వద్ద డెవోన్ కాన్వే (1) తొలి వికెట్‌గా వెనుదిరిగినప్పటికీ గైక్వాడ్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఆడాడు. క్రీజులోకి వచ్చింది మొదలు బ్యాట్‌తో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు. అంతేకాదు, ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి సిక్సర్, తొలి అర్ధ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గానూ రికార్డులకెక్కాడు. నిజానికి గైక్వాడ్ బాదుడు చూసి స్కోరు 200 పరుగులు దాటుతుందని అభిమానులు భావించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన వారెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో గైక్వాడ్ వన్ మ్యాన్ ఆర్మీగా మారి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. మొత్తంగా 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసిన గైక్వాడ్ సెంచరీకి 8 పరుగుల ముందు అల్జారీ జోసెఫ్ బౌలింగులో శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
గుజరాత్ బ్యాటర్లలో మొయిన్ అలీ (23), బెన్ స్టోక్స్(7), అంబటి రాయుడు (12), శివం దూబే (19), రవీంద్ర జడేజా(1) దారుణంగా నిరాశ పరిచారు. చివర్లో ధోనీ 7 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 14 పరుగులు చేసి జట్టు స్కోరును 178 పరుగులకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ చెరో తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
Updated Date - 2023-03-31T21:49:24+05:30 IST