Jasprit Bumrah: బుమ్రా మరింత కాలం ఆగక తప్పదు.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ‘నో’
ABN, First Publish Date - 2023-01-09T17:04:28+05:30
అంతర్జాతీయ పునరాగమనం కోసం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరికొంతకాలం ఆగక తప్పేలా లేదు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పునరాగమనం కోసం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరికొంతకాలం ఆగక తప్పేలా లేదు. శ్రీలంక(Sri Lanka)తో రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రాకు తొలుత స్థానం కల్పించారు. అయితే, అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వన్డే సిరీస్ నుంచి తప్పించారు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా గతేడాది సెప్టెంబరు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
బుమ్రాను తొలుత శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినా ఆ తర్వాత పక్కనపెట్టడంపై బీసీసీఐ(BCCI) మాట్లాడుతూ.. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వన్డే జట్టు నుంచి బుమ్రాను తప్పించిన సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేదీ వెల్లడించలేదు.
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం జనవరి 3న ఎంపిక చేసిన భారత జట్టులో సెలక్షన్ కమిటీ తొలుత బుమ్రా పేరును కూడా చేర్చింది. అయితే, ఆ తర్వాత అతడి గాయాన్ని, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని పక్కనపెట్టింది. శ్రీలంతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం (10న) గువాహటిలో తొలి వన్డే జరుగుతుంది. 12న కోల్‌కతా, 15న తిరువనంతపురంలో రెండుమూడు వన్డేలు జరుగుతాయి.
గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ తర్వాత బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గతేడాది ఆసియాకప్‌కు దూరమైన బుమ్రా ఆ తర్వాత ఆస్ట్రేలియా జరిగిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికీ గాయం తిరగబెట్టడంతో దానికి కూడా దూరమయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు సెలక్టర్లు బుమ్రాను దూరం పెట్టారు. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ కోసం జట్లను ఎంపిక చేసినప్పుడు కూడా బుమ్రా పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఆ తర్వాత అతడి పేరును చేర్చినప్పటికీ తాజాగా మరోమారు అతడిని తప్పించారు.
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం జట్టు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.
Updated Date - 2023-01-09T17:04:30+05:30 IST