Netherlands: వరుసగా రెండు ప్రపంచకప్‌లలో సఫారీలను చిత్తు చేసిన డచ్ టీమ్
ABN, First Publish Date - 2023-10-18T16:27:35+05:30
నెదర్లాండ్స్ టీమ్ సఫారీలకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ ఓడించింది.
టీమిండియా గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. కొన్నిరోజుల కిందట డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఆప్ఘనిస్తాన్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా.. తాజాగా దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చావుదెబ్బ కొట్టింది. దీంతో అటు ఇంగ్లండ్, ఇటు దక్షిణాఫ్రికా జట్ల సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే నెదర్లాండ్స్ టీమ్ సఫారీలకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ ఓడించింది. అడిలైడ్ వేదికగా నవంబర్ 6న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. స్టెఫన్ మైబర్గ్, టామ్ కూపర్, కొలిన్ అంకర్‌మ్యాన్ బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించారు.
ఇది కూడా చదవండి: ICC ODI Rankings: టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు
అయితే 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా సులభంగానే గెలుస్తుందని క్రికెట్ అభిమానులు అంచనా వేశారు. కానీ సఫారీలకు నెదర్లాండ్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. 64 పరుగులకే డికాక్, బవుమా, రోసౌ వంటి స్టార్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసు నుంచి దక్షిణాఫ్రికా తప్పుకుంది. తాజాగా ఏడాది కూడా గడవకముందే మరోసారి డచ్ టీమ్ సఫారీలను కోలుకోలేని దెబ్బ కొట్టారు. వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో సఫారీ జట్టు జోరు మీద కనిపించింది. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లపై విజయాలు సాధించడంతో బవుమా సేన ఆత్మవిశ్వాసంతో కనిపించింది. కానీ ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మరోసారి షాక్ ఇచ్చింది. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా మాత్రం 207 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని మూటగట్టుకుంది.
Updated Date - 2023-10-18T16:27:35+05:30 IST