Virat Kohli: విరాట్ కోహ్లీ వారసుడు ఎవరో చెప్పేసిన పాక్ మాజీ క్రికెటర్!
ABN, First Publish Date - 2023-04-15T18:49:06+05:30
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. మరి అతడి తర్వాత ఎవరన్న ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా(Ramiz Raja) సూటిగా సమాధానం చెప్పాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు. శుభమన్ గిల్(Shubman Gill). దాదాపు ప్రతి ఫార్మాట్‌లోనూ సెంచరీ సాధించిన గిల్.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్(GT)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 67 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌పై అతడి ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత రమీజ్ రాజా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీకి గిల్ వారసుడు అవుతాడని కితాబిచ్చాడు.
గిల్ మంచి సామర్థ్యం ఉన్న ఆటగాడని, అతడికి చాలా సమయం ఉందని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేసేటప్పడు సహజంగానే చాలా అద్భుతంగా కనిపిస్తాడని అన్నాడు. అతడు డ్రైవ్స్ చేస్తే ఆ షాట్‌లో కర్వ్ ఉంటుందన్నాడు. స్ట్రోక్స్ ఆడేందుకు అతడికి చాలా సమయం ఉందని రమీజ్ రాజా పేర్కొన్నాడు. అతడు ఆఫ్ సైడ్‌లో స్కోర్ చేస్తాడా? ఆన్‌సైడ్‌లో చేస్తాడా? లేదంటే హుక్ చేస్తాడా? పుల్ చేస్తాడా? అనేది అనవసరమని, అతడు ఏం చేసినా చాలా క్లీన్‌గా ఉంటుందని కితాబిచ్చాడు. విరాట్ కోహ్లీ వారసుడు అతడే అవుడతాడని చాలా మంది అంచనా వేస్తున్నారని రమీజ్ తన యూట్యూబ్ చానల్‌లో చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మలోని లక్షణాలన్నీ గిల్‌లో ఉన్నాయన్న రమీజ్.. అతడి టెంపరమెంట్ చాలా బలంగా ఉంటుందన్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఏవైనా బౌలర్లను గిల్ ఇబ్బంది పెడతాడన్నాడు. అతడిని చూసినప్పుడు సమయం ఆగిపోయిన భావన కలుగుతుందన్నాడు. అంత యవ్వనంలో ఉన్న ఆటగాడిపై ఇప్పటికే పలు రికార్డులు ఉన్నాయని, అతడికి ఆకాశమే హద్దంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, గిల్ అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించాడు. టెస్టులో రెండు, వన్డేల్లో నాలుగు, టీ20ల్లో ఒక శతకం అతడి పేరున ఉన్నాయి.
Updated Date - 2023-04-15T18:49:06+05:30 IST