Rishabh Pant: ఊతకర్ర సాయంతో నడుస్తున్న రిషభ్ పంత్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు!
ABN, First Publish Date - 2023-02-10T21:09:39+05:30
టీమిండియా (Team India) వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి
న్యూఢిల్లీ: టీమిండియా (Team India) వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. డిసెంబరు 30 జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్(pant) తాజాగా ఊతకర్ర సాయంతో నడుస్తున్న ఫొటోలను షేర్ చేశాడు.
పంత్ తన మెర్సిడెస్ బెంజ్ కారులో గతేడాది డిసెంబరు 30న ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే అప్రమత్తమై కారు అద్దాలు బద్దలుగొట్టి బయటకు లాగడంతో పెను ప్రమాదం నుంచి పంత్ బయపడ్డాడు.
ప్రస్తుతం కోలుకుంటున్న పంత్ (Pant) మరికొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కాక తప్పదు. ఊతకర్ర(Crutch) సాయంతో నడుస్తున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన పంత్.. ‘ఓ అడుగు ముందుకు, ఓ అడుగు బలంగా, ఓ అడుగు మెరుగ్గా’ అని క్యాప్షన్ తగిలించాడు. అతడి మోకాలికి బలమైన గాయం కావడంతో జనవరి 26న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రమాదం తర్వాత తొలిసారి పంత్ (Rishabh Pant)షేర్ చేసిన ఫొటోలను చూసిన అభిమానులు గుండె తరక్కుపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
భారత జట్టు(Team India)కు పంత్ దూరం కావడంతో కేఎస్ భరత్(KS Bharat)కు జట్టులో స్థానం లభించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌తో భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన పంత్.. గతేడాది 7 టెస్టుల్లో 61.81 సగటుతో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై సాధించిన రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
అలాగే, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో పంత్ అజేయంగా 125 పరుగులు చేశాడు. అయితే, టీ20ల్లో మాత్రం పంత్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కు పంత్ సారథ్యం వహించాల్సి ఉంది. అయితే, గాయం కారణంగా మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరులో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 6 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో విజయవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పంత్ గుర్తింపు దక్కించుకున్నాడు.
Updated Date - 2023-02-10T21:09:40+05:30 IST