Kohli vs Ganguly: వైరల్ అవుతున్న మరో వీడియో!
ABN, First Publish Date - 2023-04-17T15:59:52+05:30
టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), స్టార్ క్రికెటర్
బెంగళూరు: టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మధ్య పొడసూపిన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ కేపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గంగూలీతో చేయి కలిపేందుకు కోహ్లీ నిరాకరించాడు. అది చూసి రికీ పాంటింగ్ వారించినా సరే.. ససేమిరా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ఈ వీడియో ఇంకా వైరల్ అవుతుంగానే వీరిద్దరికీ సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లీ డగౌట్‌లో కూర్చున్న సమయంలో ఢిల్లీ ఆటగాళ్లు అతడి ముందు నుంచీ వెళ్లారు. డ్రింక్ తాగుతూ వెళ్తున్న గంగూలీని కోహ్లీ అదే పనిగా కన్నార్పకుండా చూడడం ఈ వీడియోలో కనిపిస్తోంది. కోహ్లీ చూపులు చూస్తుంటే గంగూలీపై అతడికింకా కోపం చల్లారలేదని అర్థం అవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లీ-గంగూలీ మధ్య రెండేళ్ల క్రితం విభేదాలు మొదలయ్యాయి. భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సమయంలో గంగూలీ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత గంగూలీ మాట్లాడుతూ.. కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగాలని కోరినప్పటికీ నిరాకరించాడని పేర్కొన్నాడు. అయితే, ఆ మాటల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని, బీసీసీఐ అసలు తనను సంప్రదించనేలేదని కోహ్లీ తేల్చి చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓటమి పాలు కావడంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీని కూడా వదులకున్నాడు. ఇక, అప్పటి నుంచి గంగూలీ-కోహ్లీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
Updated Date - 2023-04-17T15:59:52+05:30 IST