Sehwag: ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పేసిన వీరేంద్ర సెహ్వాగ్
ABN, First Publish Date - 2023-02-17T19:48:24+05:30
ఐపీఎల్(IPL)లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్(IPL)లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(MI) జట్లకు వరుసపెట్టి ట్రోఫీలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మలలో ఎవరు బెస్ట్ కెప్టెన్? ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే. కెప్టెన్‌గా భారత జట్టును ధోనీ(MS Dhoni) మరో మెట్టు ఎక్కించాడు. తిరుగులేని విజయాలు అందించాడు. ముంబైకి రోహిత్ శర్మ(Rohit Sharma) ఒంటి చేత్తో ట్రోఫీలు తెచ్చి పెట్టాడు. కాబట్టి వీరిద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అంటే చెప్పడం కొంచెం కష్టమే.
అయితే, టీమిండియా మీజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) మాత్రం రోహిత్ శర్మకే ఓటేశాడు. దీనికి కారణం గత 15 ఏళ్లలో ముంబై ఇండియన్స్‌కు అత్యధిక ట్రోఫీలు అందించడమే. ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిళ్లు అందుకుంది.
ఎవరు గొప్ప కెప్టెన్ అన్న విషయాన్ని నంబర్లే చెబుతాయన్న సెహ్వాగ్.. భారత జట్టుకు కెప్టెన్‌గా ధోనీకి విశేష అనుభవం ఉందని, ఆ తర్వాత సీఎస్‌కేకు కూడా ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడని గుర్తు చేశాడు. అయితే, రోహిత్ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ అయి విజయవంతంగా కొనసాగుతున్నాడని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఐపీఎల్ 15 సంవత్సరాల వేడుక కార్యక్రమంలో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అయితే, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ధోనీకే ఓటేశాడు. అతడే ఐపీఎల్ బెస్ట్ స్కిప్పర్ అని తేల్చి చెప్పాడు. తానైతే ధోనీకే ఓటు వేస్తానని భజ్జీ పేర్కొన్నాడు. అతడు తొలి నుంచీ ఒకే ఫ్రాంచైజీకి అడుతున్నాడని, ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపించడంలో ధోనీ గొప్ప పాత్ర పోషించాడని కొనియాడాడు. జట్టుకు అతడు నాయకత్వం వహించిన విధానం అసాధారమని ఆకాశానికెత్తేశాడు. ఇతర జట్ల కెప్టెన్లు కూడా బాగానే ఆడి విజయాలు సాధించారని, ఓవరాల్‌గా అయితే మాత్రం తన ఓటు ధోనీకేనని హర్భజన్ స్పష్టం చేశాడు.
ట్రోఫీల పరంగా చూస్తే రోహిత్ శర్మ ఐదు, ధోనీ నాలుగు గెలిచారని, తాను రెండు జట్లకు ఆడానని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌కు పదేళ్లు ఆడాను కాబట్టి తన గుండె ఇంకా అటువైపే కొట్టుకుంటోందని పేర్కొన్నాడు. అయితే, సీఎస్‌కేకి ఆడిన రెండేళ్లు తాను ఎంతో నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
Updated Date - 2023-02-17T19:48:25+05:30 IST