Gongadi Trisha: తండ్రి కల నెరవేరిన వేళ..

ABN , First Publish Date - 2023-01-20T03:02:34+05:30 IST

గొంగడి త్రిష.. 17 ఏళ్ల ఈ తెలంగాణ యువ క్రికెటర్‌ పేరు ఇటీవలి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది.

Gongadi Trisha: తండ్రి కల నెరవేరిన వేళ..

గొంగడి త్రిష ప్రస్థానం

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): గొంగడి త్రిష.. 17 ఏళ్ల ఈ తెలంగాణ యువ క్రికెటర్‌ పేరు ఇటీవలి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగి అంతగా ఆకట్టుకోలేకపోయినా.. స్కాట్లాండ్‌పై ఓపెనర్‌గా అర్ధసెంచరీతో జట్టు విజయానికి కారణమైంది. లెగ్‌ స్పిన్నర్‌గానూ రాణించగల త్రిష 2005లో భద్రాచలంలో జన్మించింది. రెండేళ్ల వయస్సు నుంచే క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకున్న త్రిష అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టుకు ఎంపికై తన తండ్రి కలను నెరవేర్చింది. ఎందుకంటే.. తనకు పుట్టేది ఎవరైనా సరే వారిని క్రికెటర్‌గా చూడాలని తండ్రి జీవీ రామిరెడ్డి ముందే నిర్ణయించుకున్నాడట. ఈ విషయంలో అతడు ఎంతగా పరితపించాడంటే.. త్రిష 18 నెలల ప్రాయంలో ఉన్నప్పుడే టీవీల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు పెట్టేవాడు. రెండేళ్ల వయస్సులో ప్లాస్టిక్‌ బ్యాట్‌, బాల్‌తో క్రికెట్‌ రుచి చూపించిన తను.. మరుసటి ఏడాదికి టెన్నిస్‌ బంతులతో ప్రాక్టీస్‌ చేయించాడు. ఆ తర్వాత చిన్నారి త్రిషకు రోజులో 300 బంతుల వరకు విసిరి బ్యాటింగ్‌లో రాటుదేలేలా ప్రయత్నించేవాడు.

కూతురి కోసం ఉద్యోగాన్ని వదిలి..

భద్రాచలం ఐటీసీ కంపెనీలో రామిరెడ్డి ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌గా పనిచేసేవాడు. కూతురికి క్రికెట్‌లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఉద్యోగాన్ని వదిలి పదేళ్ల క్రితం భద్రాచలం నుంచి సికింద్రాబాద్‌కు మకాం మార్చాడు. ఇక్కడి సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీలో ఏడేళ్ల త్రిషను చేర్చాడు. దిగ్గజ మిథాలీ రాజ్‌ను చిన్నప్పటి నుంచీ అదే అకాడమీలో చూస్తూ వచ్చిన త్రిష కూడా తనలాగే పెద్ద క్రికెటర్‌ కావాలనుకుంది. అప్పుడప్పుడూ మిథాలీ సలహాలు కూడా తీసుకునేది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రతిభ కారణంగా ఏడేళ్ల వయస్సులోనే తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ మహిళల మీట్‌లో ఆడడంతో పాటు, 2014-15లో ఇంటర్‌ స్టేట్‌ టోర్నమెంట్‌లో రాణించింది. అప్పటికి తన వయస్సు తొమ్మిదేళ్లు కూడా లేకపోవడం గమనార్హం.

అనంతరం అండర్‌-19లో హైదరాబాద్‌ టీమ్‌, సౌత్‌జోన్‌ జట్టులోనూ చోటు చేజిక్కించుకుంది.. ఇక 2017-18 సీనియర్‌ మహిళల ఇంటర్‌ స్టేట్‌ టీ20 టోర్నీలో త్రిష హైదరాబాద్‌ తరఫున అరంగేట్రం చేసింది. అటు రైల్వేస్‌ ప్లేయర్‌ అయిన మిథాలీకి బౌలింగ్‌ చేయడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఆరంభంలో పేసర్‌గా ఉన్న త్రిష... కోచ్‌ జాన్‌ మనోజ్‌ సూచన మేరకు లెగ్‌ స్పిన్‌కు మారింది. 2018, అక్టోబరులో బరోడాలో స్పిన్‌ బౌలింగ్‌ శిబిరం జరిగింది. దీనికి సీనియర్‌ జట్టుకు ఆడుతున్న బౌలర్లు కూడా వచ్చారు. త్రిష కూడా ఈ క్యాంప్‌నకు ఎంపిక కావడంతో జాతీయ జట్టులో చోటుకు మార్గం సుగమమైంది. క్వాడ్రాంగ్యులర్‌ సిరీ్‌సతో పాటు కివీస్‌, దక్షిణాఫ్రికాలతో భారత అండర్‌-19 జట్టులో ఆడి అదరగొట్టింది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోనూ చోటు దక్కించుకుని తండ్రి కలను నిజం చేసింది.

Updated Date - 2023-01-20T12:38:30+05:30 IST