SRHvsLSG: లక్నో గెలుపు.. సన్‌రైజర్స్ ఓటమి.. మర్క్రమ్ వచ్చినా మారిందేమీ లేదు..!
ABN, First Publish Date - 2023-04-07T23:22:47+05:30
ఐపీఎల్-16 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌ను చేజార్చుకుంది. లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడగా.. లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో..
ఐపీఎల్-16 (IPL 2023) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో మ్యాచ్‌ను చేజార్చుకుంది. లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ (SRHvsLSG) తలపడగా.. లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య సాధనలో 5 వికెట్ల కోల్పోయిన లక్నో జట్టు 16 ఓవర్లకే 122 పరుగుల టార్గెట్‌ను ఫినిష్ చేసి నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే హైదరాబాద్‌కు ఘోర ఓటమిని రుచి చూపింది. పూరన్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించి విన్నింగ్ షాట్‌తో లక్నో అభిమానులకు మజా పంచాడు. లక్నో బ్యాట్స్‌మెన్స్‌లో కేఎల్ రాహుల్ 35 పరుగులు, క్రూనల్ పాండ్యా 34 పరుగులతో రాణించారు. క్రూనల్ పాండ్యా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్ పిచ్‌లో లక్నో బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను చిత్తు చేశారు. లక్నో స్పిన్ బౌలర్లు హైదరాబాద్ జట్టును ఘోరంగా దెబ్బతీశారు.
ఆత్మ విశ్వాసంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో దూకుడు చూపించలేకపోయింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ (31), రాహుల్ త్రిపాఠి (35) పరుగులు మినహాయిస్తే ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ చెప్పుకోతగిన స్కోర్ చేయకపోవడం హైదరాబాద్ కొంప ముంచింది. మర్క్రమ్‌పై హైదరాబాద్ అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ మర్క్రమ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరగడం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. హైదరాబాద్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మరో క్రికెటర్ బ్రూక్. తొలి మ్యాచ్‌లో 13 పరుగులు చేసి విమర్శల పాలైన బ్రూక్ ఈ మ్యాచ్‌లో కేవలం 3 పరుగులకే పెవిలియన్ బాట పట్టడం సన్‌రైజర్స్ అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
ఈ మ్యాచ్ ప్రస్తావన తర్వాత ఎప్పుడైనా వచ్చినా క్రూనల్ పాండ్యా గురించి గుర్తుచేసుకోకుండా ఉండలేరు. క్రూనల్ పాండ్యా బౌలింగ్ చేసిన 4 ఓవర్లకు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, మర్క్రమ్ ఈ ముగ్గురినీ క్రూనలే ఔట్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ క్రూనల్ అదరగొట్టాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా 2 వికెట్లతో రాణించాడు. లక్నో స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటారు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయికి చెరో వికెట్ దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అడిల్ రషీద్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్‌కు తలో వికెట్ దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఇది రెండో గెలుపు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. సన్‌రైజర్స్ ఆటతీరుపై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావ్య మారన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Updated Date - 2023-04-08T01:18:08+05:30 IST