R Ashwin: టెస్టు బౌలర్లలో అశ్విన్‌కు అగ్రస్థానం
ABN, First Publish Date - 2023-03-01T17:12:57+05:30
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్లలో అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) రెండవ స్థానానికి పడిపోయాడు...
ఇండోర్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) రెండవ స్థానానికి పడిపోయాడు. బార్డర్-గవాస్కర్ ట్రోఫీ2023 భాగంగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేయడం నంబర్ 1 ర్యాంక్ చేరుకోవడానికి తోడ్పడింది. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ రాణిస్తే అశ్విన్ ర్యాంకింగ్ మరింత పదిలమవుతుంది. కాగా 40 ఏళ్ల వయసులో నంబర్ 1 ర్యాంక్ సాధించి అశ్విన్ అరుదైన ఆటగాడిగా నిలిచాడు. 1936లో ఆస్ట్రేలియా ఆటగాడు క్లార్రీ గ్రిమ్మెట్ తర్వాత ఇంత పెద్ద వయసులో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. కాగా న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. అశ్విన్‌ను అధిగమించేందుకు ఈ వికెట్లు సరిపోవు. కాగా ఫిబ్రవరి 22 వరకు ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) మొదటి స్థానానికి దూసుకొచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఐసీసీ టెస్టు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ చెరొక స్థానం ఎగబాకి 4, 5 ర్యాంకుల్లో నిలిచారు. వీరిద్దరూ గతేడాది జులై నుంచి టెస్టు మ్యాచులేమీ ఆడకపోయినా ఈ స్థానాల్లో నిలవడం విశేషం. కాగా ఇంగ్లండ్ బౌలర్ ఒల్లీ రాబిన్సన్ రెండు స్థానాలు దిగజారి నంబర్ 6 ర్యాంక్‌కు పడిపోవడం ఒకింత కారణమైంది.
ఇక భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకున్నాడు. ఢిల్లీ టెస్టులో 10 వికెట్లు, 26 వికెట్లు పడగొట్టడంతో 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక టెస్టు ఫార్మాట్ ఆల్‌రౌండర్లలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
Updated Date - 2023-03-01T17:19:33+05:30 IST