Disney+ Hotstar: డిస్నీ+హాట్‌స్టార్‌ను వీడని కష్టాలు.. ఏకంగా కోటికిపైగా సబ్‌స్క్రైబర్ల కోత
ABN, First Publish Date - 2023-08-10T20:10:58+05:30
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను(Disney + Hotstar) సబ్‌స్క్రైబర్ల కష్టాలు వెంటాడుతున్నాయి. మూడో త్రైమాసికంలో ఏకంగా కోటి 25 లక్షల మంది(12.5 మిలియన్లు) సబ్‌స్క్రైబర్లను(subscribers) కోల్పోయింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను(Disney + Hotstar) సబ్‌స్క్రైబర్ల కష్టాలు వెంటాడుతున్నాయి. మూడో త్రైమాసికం మొదటి నెలలోనే ఏకంగా కోటి 25 లక్షల మంది(12.5 మిలియన్లు) సబ్‌స్క్రైబర్లను(subscribers) కోల్పోయింది. గత త్రైమాసికంతో పోలిస్తే 7.4 శాతం సబ్‌స్క్రైబర్లు దూరమయ్యారు. రెండో త్రైమాసికంలో 157.8 మిలియన్లుగా ఉన్న సబ్‌స్క్రైబర్లు మూడో త్రైమాసికానికి 146.1 మిలియన్లకు తగ్గిపోయారు. అమెరికా, కెనాడా దేశాల నుంచే దాదాపు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు హాట్‌స్టార్‌కు దూరమయ్యారు. దీంతో మూడో త్రైమాసికంలో డిస్నీ+హాట్‌స్టార్‌కు ఏకంగా 460 మిలియన్ల నష్టం వాటిల్లింది. అయితే షేర్లు మాత్రం 2.5 శాతం పెరగడం గమనార్హం. కాగా డిస్నీ + హాట్‌స్టార్ గత ఐపీఎల్(IPL) సీజన్ ప్రసార హక్కులను కోల్పోవడం కొంపముంచింది. అప్పటి నుంచే క్రమంగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతూ వచ్చింది. నిజానికి డిస్నీ+హాట్‌స్టార్‌కు క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించే వారి నుంచి భారీగా సబ్‌స్క్రైబర్లు ఉండేవాళ్లు. దీనికి తగ్గట్టు సదరు యాప్ కూడా క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసేది. ముఖ్యంగా ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలలో జరిగే మ్యాచ్‌లను ఎక్కువగా ప్రసారం చేసేది.
కానీ గత ఐపీఎల్ సీజన్ హక్కుల వేలంలో డిస్నీ+హాట్‌స్టార్‌ను వెనక్కి నెట్టి జియో సినిమా(JIO Cinema) ప్రసార హక్కులను దక్కించుకుంది. దీంతో క్రికెట్ ప్రేమికులంతా ఒక్కసారిగా డిస్నీ+హాట్‌స్టార్‌కు దూరమయ్యారు. పైగా వచ్చే సంవత్సరం నుంచి పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు తీసుకురానున్నట్లు ప్రకటించడం కూడా సబ్స్‌క్రైబర్లు తగ్గిపోవడానికి ఒక కారణమైంది. అయితే యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపుదల, హుల్ ప్లాన్ ధరల పెంపుదలతో కంపెనీ మళ్లీ లాభాల బాట పడుతుందని డిస్నీ+హాట్‌స్టార్ సీఈఓ బాబ్ ఇగర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారన్ని లాభదాయకంగా మార్చేందుకు ఉపయోగపడే బహుల మార్కెట్ల కోసం వేచిచూస్తున్నామని బాబ్ ఇగర్ తెలిపారు. తక్కువ పెట్టుబడితో మెరుగైన సేవలను అందించే మార్కెట్లు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు 27 శాతం పెరిగి 14 డాలర్లకు, హుల్ ప్లాన్ ధర 18 డాలర్లకు పెంచనుందని సమాచారం. కాగా ఈ ధరలు నెట్‌ఫ్లిక్స్ కంటే ఖరీదైనవి కావడం గమనార్హం.
Updated Date - 2023-08-10T20:10:58+05:30 IST