Launch Of Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం ఆలస్యం..ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఇస్రో
ABN, First Publish Date - 2023-07-06T23:01:36+05:30
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కాస్త ఆలస్యం కానుంది. ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. ఒక రోజు ఆలస్యంగా జులై 14న రాకెట్‌ను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కాస్త ఆలస్యం కానుంది. ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. ఒక రోజు ఆలస్యంగా జులై 14న రాకెట్‌ను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆలస్యానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై రోవర్‌ను దించేందుకు భారత్ చేస్తున్న మూడో ప్రయత్నం.
మిషన్‌లో భాగంగా ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారమే పూర్తిచేశారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3ని ప్రయోగించనున్నారు. ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ సెంటర్‌లో తయారు చేశారు. ఉపగ్రహం సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.
చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్-2 మిషన్‌ను చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఆర్బిటర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైనప్పటికీ.. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది. ఈ మిషన్‌లో లోపాలను సవరిస్తూ.. ఇస్రో తాజా మిషన్ చేపడుతోంది. 2008లో చంద్రయాన్-1 ను చేపట్టింది. అది విజయవతంగా జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది.
Updated Date - 2023-07-06T23:01:36+05:30 IST