Raithu Bandhu : వనమాను పట్టించిన రైతుబంధు!
ABN, First Publish Date - 2023-07-26T03:56:52+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2018 నాటి సాధారణ ఎన్నికల్లో ఆయనపై బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి
కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
సాగు భూమికి ఎమ్యెల్యే రైతుబంధు డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు
ఇతర ఆస్తుల వివరాలనూ అఫిడవిట్‌లో వెల్లడించని వనమా
విచారణలో నిర్ధారించిన రాష్ట్ర హైకోర్టు
కొత్తగూడెంలో రెండోస్థానంలో నిలిచిన జలగం వెంకట్రావే ఎమ్మెల్యే
2018 నుంచీ ఆయనే ఎమ్మెల్యే అని స్పష్టం చేసిన న్యాయస్థానం
తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వనమాకు 5 లక్షల ఫైన్
జలగం వెంకట్రావు కేసు ఖర్చులు సైతం చెల్లించాలని తీర్పు
శ్రీనివా్‌సగౌడ్‌పైనా అనర్హత కత్తి.. హైకోర్టులో మంత్రికి ఎదురుదెబ్బ
హైదరాబాద్/ కొత్తగూడెం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(MLA Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2018 నాటి సాధారణ ఎన్నికల్లో ఆయనపై బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావు(Jalagam Venkatarao)నే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్(Election affidavit) దాఖలు చేసినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన మొత్తం ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను వనమా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని వెంకట్రావు చేసిన ఆరోపణలను హైకోర్టు(High Court) నిర్ధారించింది. ఈ క్రమంలో వనమా పేరిట ఉన్న భూములకు రైతుబంధు డబ్బులు విడుదల కావటం కూడా ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక కీలక ఆధారంగా నిలిచింది.
నేపథ్యమిదీ..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్(Congress) తరఫున వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆయనకు 81,118 ఓట్లు వచ్చాయి. అధికార బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ పడగా ఆయనకు 76,979 ఓట్లు వచ్చాయి. 4,139 ఓట్ల తేడా తో వనమా గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పు డు వివరాలు సమర్పించారని, ఆయన భార్యకు సంబంధించిన ఆస్తుల వివరాలు వెల్లడించలేదని, ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదని.. కాబట్టి ఆయన ఎన్నిక రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని జలగం వెంకట్రావు 2019 జనవరి 25న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలంటూ వనమా హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు నిరాకరించటంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ 2021 నవంబరు 8న విచారించి ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మళ్లీ హైకోర్టుకు వచ్చిన ఈ కేసుపై గత ఏడాది మార్చి రెండో వారం తర్వాత పలు దఫాలుగా విచారణ జరిగింది. జస్టిస్ జీ రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది.
జలగం తరఫు న్యాయవాది కే రమేశ్ వాదనలు వినిపిస్తూ.. వనమా తన ఎన్నికల అఫిడవిట్‌లో 2014 నాటి క్రిమినల్ కేసు ఎఫ్‌ఐఆర్ నెంబర్ 127కు సంబంధించిన కేసు వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఆయన భార్య పేరిట న్యూపాల్వంచ ఇందిరానగర్‌లోని 300 చదరపు గజాల ఆస్తి గురించి కూడా తెలుపలేదని పేర్కొన్నారు. సదరు ఆస్తిలో 151 చదరపు గజాలను వనమా భార్య 2018లో నాగలంచు హరిత అనే మహిళకు రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ద్వారా విక్రయించారని పేర్కొన్నారు. అలాగే ప్రతివాది తనకు హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎ్‌ఫ) నుంచి ఆదాయం ఉందని పేర్కొన్నారే తప్ప దాంట్లో ఇతర సభ్యులు ఎవరు? హెచ్‌యూఎ్‌ఫ తరఫున తనకు రెండో పాన్ కార్డు ఉందనే విషయాన్ని కూడా వెల్లడించలేదని తెలిపారు. వనమా కుమారులకు చీరాల, ఏలూరుల్లో రెండు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని.. అందులో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ క్రిస్టియన్ మైనా ర్టీ సొసైటీ కింద మంజూరైందని.. అలాంటప్పుడు హిందూ అవిభాజ్య కుటుంబం ఉండదని.. ఈ వివరా లు మొత్తం ప్రతివాది దాచిపెట్టారని పేర్కొన్నారు. 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన పలు స్థిరాస్తుల వివరాలను తాజా 2018 ఎన్నికల అఫిడవిట్‌లో చూపించలేదని.. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం సదరు భూములు ఇంకా ప్రతివాది, ఆయన భార్య పేరుమీదే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా వివరాలు దాచిపెట్టడం.. కేసుల వివరాలు వెల్లడించకపోవడం ఓటర్లను మోసం చేయడమే కాకుండా అవినీతికి పా ల్పడడమేనని.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకోవడంతోపాటు ప్రాసిక్యూషన్ విట్‌నె స్‌ల స్టేట్‌మెంట్‌లను ధర్మాసనం సమగ్రంగా పరిశీలించింది. పాల్వంచ మండల వ్యవసాయ అధికారి ఇచ్చి న స్టేట్‌మెంట్ ప్రకారం పాల్వంచలోని సర్వే నంబర్ 122/2/సంస్తాన్ 1 ఎకరం 33 గుంటలకు వనమా రైతుబంధు నిధులు తీసుకున్నట్లు వెల్లడించారు. సద రు భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎనిమిదిసార్లు మొత్తం రూ.69,350 తీసుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆయన భార్య పేరు మీద పాల్వంచలో సర్వే నంబర్ 992లో 8.37 ఎకరాల విషయంలో సైతం ఆధారాలు స్పష్టంగా ఉన్నట్లు హైకోర్టు పేర్కొన్నది. తప్పుడు వివరాలు వెల్లడించడంతోపాటు ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్లు ఆధారాలతో సహా వెల్లడి కావడంతో వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన తర్వాత స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు ఇచ్చింది.
కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ గూటికి..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు మహాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వదిలి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. హైకోర్టు తీర్పుతో నియోజకవర్గంలో జలగం వెంకట్రావు వర్గీయులు సంబురాలు చేసుకుంటున్నారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్
పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
2018 సాధారణ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పేర్కొంటూ దాఖలైన ఎలక్షన్ పిటిషన్‌లో మంత్రికి ఎదురుదెబ్బ తగిలింది. తనకు వ్యతిరేకంగా చలువగాలి రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ చెల్లదని... దానిని కొట్టేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ ఎం లక్ష్మణ్ ధర్మాసనం మంత్రి పిటిషన్‌ను కొట్టేస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రాఘవేంద్ర రాజుకు పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదన్న మంత్రి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రికి వ్యతిరేకంగా రాఘవేంద్ర రాజు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తదుపరి విచారణ కొనసాగనుంది.
Updated Date - 2023-07-26T04:22:35+05:30 IST