MLC Kavitha: కవితకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు..!
ABN, First Publish Date - 2023-02-16T18:28:55+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో సీఎం కేసీఆర్ (CM KCR) తనయ, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు మరింతగా ఉచ్చు బిగుస్తోంది.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో సీఎం కేసీఆర్ (CM KCR) తనయ, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు మరింతగా ఉచ్చు బిగుస్తోంది. కవిత ఇతరులతో కలిసి లిక్కర్ స్కామ్‌లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని సీబీఐ (CBI) ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టు కీలకమైన ఈ వ్యాఖ్యలు చేసింది. మద్యం కుంభకోణంలో నిందితులపై ఈడీ (ED) చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులైన సమీర్‌మహేంద్రు, విజయ్‌నాయర్, బినోయ్‌బాబు, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ కీలక అంశాలను న్యాయమూర్తి నాగ్ పాల్ ప్రస్తావించారు.
కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (MP Magunta Srinivasula Reddy), ఆయన కుమారుడు రాఘవతో కలిసి ఈ ముగ్గురు వ్యవహారాలు నడిపారనేందుకు కీలక సాక్ష్యాలు , ఆధారాలను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఈడీ సమర్పించిందన్నారు. విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్ పల్లి (Abhishek Boin Pally) పాత్ర.. వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసులో ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉందని, అదే విధంగా అక్రమ డబ్బుల వ్యవహారాలు తేలాల్సిఉందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితులు సాక్ష్యాల స్టేట్ మెంట్సే కాకుండా వాట్సాప్ ఛాట్స్, సెల్ లోకేషన్స్, నగదు బదిలీకి సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్స్ , వివిధ ప్రాంతాల్లో నిందితులు హోటళ్ళలో సమావేశమవ్వడం, డిజిటల్ సాక్ష్యాలు ఉన్నాయని న్యాయస్థానం ప్రస్తావించింది.
బలమైన ఆధారాలున్నాయి..
నిందితులు కుట్రకు పాల్పడ్డారన్న ఈడీ వాదనలకు బలమైన ఆధారాలు ఉన్నాయని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయిన్ పల్లి ప్రతినిధి అనేందుకు ఆధారాలు ఉన్నాయని, ముడుపులు అందించడంలో కూడా అభిషేక్ బోయిన్ పల్లి కీలక పాత్ర పోషించారని.. ఆ ఆధారాలను ఈడీ సమర్పించిందని న్యాయస్థానం పేర్కొంది. ముడుపులుగా ఇచ్చిన 100 కోట్లలో 30 కోట్ల రూపాయల తరలింపులో అబిషేక్ పాత్ర ఉందని, మరో నిందితుడు శరత్ చంద్రారెడ్డి తరఫున ఆయనకు దక్కిన ఐదు రిటైల్ జోన్లలో అభిషేక్ వ్యవహారాలు నడిపారని కోర్టు పేర్కొంది.
ముడుపులుగా అందిన డబ్బును తిరిగి అభిషేక్ బోయిన్ పల్లి లాబాల నుండి తీసుకున్నారనే దానికి కూడా ఆధారాలు ఉన్నాయని, వివిధ సందర్భాల్లో హోటళ్ళల్లో ఇతర నిందితులుతో కలిసి అభిషేక్ సమావేశమయ్యారనే ఆధారాలు కూడా ఉన్నాయని కోర్టు తెలిపింది. మొత్తం కుట్రలో కీలక సూత్రధారి విజయ్ నాయరే అనేందుకు కూడా సాక్ష్యాలను ఈడీ కోర్టు సమర్పించింది. దినేష్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళై, కవితతో సమావేశానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. ముడుపులుగా అందించిన డబ్బులు, తిరిగి పొందడం సహా అనేక వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్రధారి అనేందుకు కూడా ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాగుంట రాఘవతో కలిసి శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) నడిపిన వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.
అరెస్టుల పర్వం..
ఢిల్లీ మద్యం స్కాం కేసులో సీబీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు అనే అపవాదు తమపై పడకుండా ఉండడానికి ఒకరి తర్వాత మరొకరిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేస్తోంది. ముందుగా కీలక వ్యక్తులను కాకుండా, వారి చుట్టూ ఉన్నవారిని అరెస్టు చేస్తోంది. వారికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులను న్యాయస్థానాలకు అందజేస్తోంది. వాటన్నిటిలోనూ కూడా నిందితులతో కలిసి కవిత మద్యం దందా చేశారని పేర్కొంటోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ బోయిన్‌పల్లి, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసుల రెడ్డి, రాఘవ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరఫున విజయ్‌నాయర్ స్వీకరించారని తెలిపింది. ఈ గ్రూప్‌నకు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేసింది.
సౌత్ గ్రూప్ భాగస్వాములు ఆప్ నేతలతో కలిసి కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఇందులో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు తమ ప్రమేయాన్ని గోప్యంగా ఉంచడానికి డమ్మీలను, ప్రాక్సీలను ప్రయోగించారని.. సౌత్ గ్రూప్ సభ్యులు, వారి ప్రతినిధులు తరచూ సమావేశం అవుతుండేవారని పేర్కొంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఎమ్మెల్సీ కవితలో అరెస్ట్‌పై కంగారు మొదలైందని బీజేపీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. ఏదేమైనా.. ఏపీ అధికార పార్టీ ఎంపీ కుమారుడి అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ తప్పదన్న ప్రచారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.
Updated Date - 2023-02-16T18:38:44+05:30 IST