TS News: జగిత్యాల జిల్లాలో అమెరికా పిస్టల్
ABN, First Publish Date - 2023-06-01T19:50:32+05:30
జగిత్యాల జిల్లా (Jagtial district)లో అక్రమ ఆయధం కలకలం సృష్టించింది. జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నందగిరి లక్ష్మీనర్సయ్య కొన్నేళ్లుగా పండ్ల
జగిత్యాల: జగిత్యాల జిల్లా (Jagtial district)లో అక్రమ ఆయధం కలకలం సృష్టించింది. జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నందగిరి లక్ష్మీనర్సయ్య కొన్నేళ్లుగా పండ్ల వ్యాపారం చేస్తూ 50 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. నష్టపోయిన డబ్బును ఎలాగైనా అక్రమ మార్గంలో సంపాదించాలని అనుకున్నాడు. ఐలాపూర్ నుంచి తన మకాంను ముంబైకి మార్చాడు. అక్కడ అసాంఘిక శక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. ముంబైలోని బిట్టు, పాటిల్, రమేష్ బాయ్, నారాయణ, రాజు బాయ్‌ల సహాయంతో అమెరికా (America) దేశానికి చెందిన పిస్టల్‌ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇటీవల కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం చేరుకున్న లక్ష్మీనర్సయ్య తన వద్ద ఉన్న పిస్టల్‌తో చుట్టు పక్క గ్రామాల్లో ఉన్న పలువురిని బెదిరించి డబ్బులు సంపాందించాలని అనుకున్నాడు. లక్ష్మీనర్సయ్య బుధవారం రాత్రి పిస్టల్‌తో ద్విచక్ర వాహనంపై ఐలాపూర్ గ్రామం నుంచి కోరుట్లకు వెళుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీ చేశారు. అటువైపు వచ్చిన లక్ష్మీనర్సయ్య పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు తనిఖీ చేయగా ఒక పిస్టల్, రెండు మ్యాగ్జిన్‌లు, మూడు బుల్లెట్లు లభించాయి. లక్ష్మీనర్సయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఉపయోగించిన సెల్ ఫోన్, మోటార్ సైకిల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ భాస్కర్ తెలిపారు.
Updated Date - 2023-06-01T19:50:32+05:30 IST