TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్..
ABN, First Publish Date - 2023-03-29T19:21:19+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై (TSPSC Paper Leakage Case) సిట్ అధికారులు (SIT Officials) దర్యాప్తు వేగవంతం చేశారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై (TSPSC Paper Leakage Case) సిట్ అధికారులు (SIT Officials) దర్యాప్తు వేగవంతం చేశారు. సిట్ ఆఫీస్‌కు పలువురు గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్థులు చేరుకున్నారు. విచారణ అనంతరం అభ్యర్థులకు సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు ముగ్గురు నిందితులనూ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను విచారించినట్లు సిట్ అధికారులు తెలిపారు. తన కోసమే A1 ప్రవీణ్ గ్రూప్-1 పేపర్ కొట్టేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ముగ్గురు TSPSC ఉద్యోగులకు ప్రవీణ్ పేపర్ ఇచ్చాడని, మొత్తం ఐదుగురికి గ్రూప్-1 పేపర్ చేరినట్టు ఆధారాలు లభించాయని చెప్పారు.
ఇప్పటివరకు గ్రూప్-1 రాసిన 84 మందిని ప్రశ్నించినట్లు సిట్ అధికారులు తెలిపారు. పరీక్షకు ముందే 12 మంది దగ్గర ఏఈ ప్రశ్నపత్రం ఉందని దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల నిందితుడు ప్రవీణ్ ఇంట్లో 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనంగా శంకర్‌లక్ష్మి డైరీలోని పాస్‌వర్డ్ తెలుసుకుని.. కంప్యూటర్‌లో డేటా చోరీ చేసినట్లు సిట్ తేల్చింది. రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్‌కు సిట్ ఎల్‌ఓసీ (L0C) జారీ చేసింది. రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ పొందాడు. ఏఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో దళారీగా తిరుపతి వ్యవహరించినట్లు గుర్తించారు. డాక్యా నుంచి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని రాజేందర్‌కు తిరుపతి విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు డాక్యా అండ్ గ్యాంగ్ బ్లాక్ టికెట్ల మాదిరిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి సమకూర్చుకునే క్రమంలో చెయిన్ ప్రాసెస్‌లో కొనుగోలు పెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన రాజేంద్రకు రూ.10 లక్షలు ఒప్పందం కింద డాక్యా ఏఈ పేపర్ అమ్మినట్లు తెలిసింది. ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన రాజేంద్ర.. ఆ పేపర్‌ను వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒకరి నుంచి ఒకరికి దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్లు భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. కాగా రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు.
Updated Date - 2023-03-29T19:23:13+05:30 IST