VenkataRamana Reddy : ఒకే ఒక్కడు.. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడగొట్టాడు..!
ABN, First Publish Date - 2023-12-03T18:38:24+05:30
తెలంగాణ ఎన్నికల ఫలితాలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డి ఫలితం మాత్రం మరొకెత్తు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డి రిజల్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డి ఫలితం మాత్రం మరొకెత్తు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డి రిజల్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. దీనికి ఒక సామాన్యుడు అసమాన విజయం సాధించడమే కారణం. ఇద్దరు హేమాహేమీలను ఓడగొట్టి హిస్టరీ సృష్టించారు. అతనెవరో కాదు.. అతి సామాన్యమైన నేత వెంకటరమణారెడ్డి. ఇప్పుడు ఈయన గురించి కేవలం కామారెడ్డే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలెందుకింత చర్చ..? ఈయన సాధించిన అంత పెద్ద విజయమేంటి..? ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక ఎన్నికల కథనంలో తెలుసుకుందాం.
హేమాహేమీలను ఓడించి..!
కామారెడ్డిలో సీఎం కేసీఆర్.. మరొకరు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో బరిలో నిలబడ్డారు. ఇక్కడ బీజేపీ తరపున వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు. కామారెడ్డిలో ఎక్కువగా కేసీఆర్, రేవంత్‌పైనే ఫోకస్ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరొకరు గెలుస్తారని అనుకున్నారే తప్పా వెంకటరమణారెడ్డి పేరు అంతగా వినిపించలేదు. కానీ అనూహ్యంగా అంతా రివర్స్ అయిపోయింది. ఇద్దరు హేమాహేమీలను ఓడించి రికార్డ్ నెలకొల్పారు రమణారెడ్డి.
ఇదొక చరిత్ర!
తొలుత కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేయడంపై విస్తృత చర్చ జరిగింది. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. రెండో స్థానానికే గులాబీ బాస్ పరిమితం అయ్యారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మూడో స్థానానికి పరిమతం అయ్యారు. చివరాకరికి కామారెడ్డి సీటు బీజేపీ ఖాతాలో పడిపోయింది. వెంకటరమణారెడ్డి 6 వేల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి తిరిగి లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
నేను లోకల్ గురూ..!
చంటిగాడు లోకల్ అన్నట్టుగా... వెంకటరమణారెడ్డి కూడా తాను లోకల్ అంటూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కేసీఆర్, రేవంత్‌రెడ్డి నాన్‌లోకల్ అని.. తానైతే లోకల్ అంటూ వెంకటరమణారెడ్డి ప్రజల్లోకి చొచ్చుకుళ్లారు. కొడంగల్‌లో బస్సు బయల్దేరితే.. తిరిగి కొడంగల్‌కే వెళ్తుందని.. మెదక్ నుంచి బస్సు బయల్దేరితే మళ్లీ మెదక్‌కే పోతుందని.. కానీ తానైతే ఇక్కడే ఉంటానని రమణారెడ్డి.. ఒక నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ప్రజల మెప్పును పొందగలిగారు. దీంతో కామారెడ్డి ప్రజలంతా పువ్వు పార్టీ లీడర్‌కు పట్టంకట్టి ఇద్దరు సీఎం క్యాండిడేట్లను ఓడించారు. ఇద్దరు బిగ్ లీడర్లను ఓడించిన మొనగాడు అంటూ వెంకటరమణారెడ్డిని నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ఏదేమైనా తెలంగాణ ఎన్నికలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డిలో బీజేపీ విజయం మాత్రం సరికొత్త రికార్డే. ఎవరు అవునన్నా.. కాదనన్నా.. వెంకటరమణారెడ్డి విజయం మాత్రం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
ఎవరీ రమణారెడ్డి..?
కామారెడ్డిలో గెలుపొందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ఇంటర్ వరకు చదువుకున్నారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి వీరాభిమాని. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. 2018లో జరిగి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన బీజేపీలో చేరి కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి సూపర్ విక్టరీ అందుకున్నారు.
తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులు చేశారు. అంతేకాకుండా ఆస్తుల్ని స్కూళ్లు, కాలేజీలకు విరాళంగా కూడా ఇచ్చేశారు. సొంత మేనిఫెస్టో విడుదల చేసి.. ఏ గ్రామాల్లో ఏం పనులు చేస్తానో చెబుతూ ప్రజల్లోకి వెళ్లారు. దీనికి తోడు స్థానికత తోడు కావడం.. కేసీఆర్, రేవంత్ నాన్ లోకల్ కావడం రమణారెడ్డికి కలిసొచ్చింది. దీంతో ఈజీగా విజయాన్ని అందిపుచ్చుకోగలిగారు.
Updated Date - 2023-12-03T18:59:33+05:30 IST