Telangana Results : బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించిన బర్రెలక్క.. మామూలు దెబ్బ కాదే..!!
ABN, First Publish Date - 2023-12-03T18:57:32+05:30
బర్రెలక్క (Barrelakka) అలియాస్ శిరీష.. ఒక నిరుద్యోగి. 2023 తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె పేరు పెద్దగా పరిచయం లేదు. సోషల్ మీడియాలో కొందరికే
బర్రెలక్క (Barrelakka) అలియాస్ శిరీష.. ఒక నిరుద్యోగి. 2023 తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె పేరు పెద్దగా పరిచయం లేదు. సోషల్ మీడియాలో కొందరికే పరిచయస్థురాలు. అర నిమిషం బర్రెల వీడియోతో శిరీష కాస్తా బర్రెలక్కగా పాఫులర్ అయ్యింది. ఇంత వరకు ఒకెత్తు అయితే ఎప్పుడైతే కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారో అప్పటి నుంచి ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. ఆమె ధైర్యాన్ని, తెగువను నెటిజన్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇక ఆమె ఉండే తడికల ఇల్లు.. కనీసం నామినేషన్ వేసేందుకు కూడా డబ్బులు లేకపోయినా విషయం ప్రజల మనసులను చూరగొంది.
రూపాయి ఖర్చు లేకుండా..!
ఇక ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత తనకు వచ్చిన మద్దతు ఊహించలేకపోయింది. సోషల్ మీడియాలో అద్భుతమైన మద్దతు లభించింది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఆమె తరపున ప్రచారం నిర్వహించారు. ఇక కొంత మంది నేతలైతే ఆర్థిక సహాయం కూడా చేసి ప్రోత్సహించారు. యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అయితే డబ్బుల సాయంతో పాటు ప్రచారం కూడా నిర్వహించారు. అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా స్వయంగా బర్రెలక్కను కలిసి ప్రచారం చేశారు. అంతేకాకుండా ఆయా వర్గాల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. పెద్ద పార్టీలు కోట్ల ఖర్చు చేసి ప్రచారం చేస్తే.. బర్కెలక్క మాత్రం రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం లభించింది.
గట్టిగానే దెబ్బ కొట్టిందిగా..!
పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా బర్రెలక్క అద్భుతమైన ఓటు షేర్ వస్తుందని తేల్చాయి. అనుకున్నట్లుగానే కారు పార్టీ తరఫున పోటీచేసిన బీరం హర్ష వర్ధన్ రెడ్డిని గట్టిగానే దెబ్బకొట్టారు బర్రెలక్క. నిరుద్యోగుల సాదకబాధకాలను పెద్ద ఎత్తునే ప్రచారం చేశారు. దీంతో చాలా మంది ప్రభావితం చేస్తూ వచ్చారు బర్రెలక్క. సీన్ కట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకతతో శిరీషకు అనుకున్నదానికంటే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. మొత్తం 5,574 ఓట్లు విజిల్ గుర్తుకు వచ్చాయి. మరీ ముఖ్యంగా బ్యాలెట్ ఓట్లలో బర్రెలక్క ముందంజలోకి రావడం.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు, స్థానిక అభ్యర్థులపై ఉద్యోగులు ఎంత గుర్రుగా ఉన్నారన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఇటు సాధారణ ఓట్లు అనుకున్నదానికంటే బర్రెలక్కకు ఎక్కువగా రావడంతో కారు పార్టీ కంగారెత్తిపోయింది. ఒకవేళ ఈ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పోలయ్యి ఉంటే.. కచ్చితంగా గెలిచేవారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. చివరాకరికి బీఆర్ఎస్ అభ్యర్థి బీరం ఓటమికి బర్రెలక్కే కారణమైందని రాజకీయ విశ్లేషకులు, స్థానిక నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఎన్నికల్లో ఓడినా సరే యావత్ తెలంగాణ ప్రజల మనసు గెలిచారంటూ బర్రెలక్కను జనాలు ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. శిరీష ఓటమితోనే సరిపెట్టుకుంటుందా.. రాజకీయంగా రానున్న రోజుల్లో ఇలాగే ముందుకెళ్తుందా..? అనేది తెలియని పరిస్థితి.
Updated Date - 2023-12-03T18:57:33+05:30 IST