Revanth Reddy: రజనీని ఆహ్వానించిన రేవంత్.. మాట నిలబెట్టుకుంటారా?
ABN, First Publish Date - 2023-12-07T03:47:36+05:30
హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనీని రేవంత్‌రెడ్డి తన ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు.
దివ్యాంగురాలు రజనీకి రేవంత్ పిలుపు
ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
సీఎం అయ్యాక తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తానని గతంలో
హామీ.. రేవంత్ మాట నిలబెట్టుకుంటారని రజని విశ్వాసం
తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానపత్రాన్ని పంపించిన రేవంత్‌రెడ్డి
అఫ్జల్‌గంజ్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనీని రేవంత్‌రెడ్డి తన ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ సీఎంగా ప్రమాణం చేశాక తొలి ఉద్యోగం రజనీకే ఇస్తారని, తన మాట నిలబెట్టుకుంటారని అంతా భావిస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గం బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన రజినీ అక్టోబరు 17న గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డిని కలిశారు. దివ్యాంగురాలిని కావడంతో తనకు ఉద్యోగం లభించడం లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రజినీ, ఆమె కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కార్డును సంతకం చేసి ఇచ్చారు. తాను సీఎం అయ్యాక తొలి ఉద్యోగం రజనీకే ఇస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ ఆహ్వానంపై స్పందిస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్‌రెడ్డి తనకే తొలి ఉద్యోగం ఇస్తారని ఆశిస్తున్నట్లు రజనీ చెప్పారు. ఇప్పటివరకు ఎంతో మంది నాయకులను కలిశానని, ఫలితం లేదని తెలిపారు. తన పీజీ పూర్తై 11సంవత్సరాలు అవుతుందని రజనీ చెప్పారు.
Updated Date - 2023-12-07T10:54:19+05:30 IST