BJP Bandi Sanjay : జైలుకు సంజయ్
ABN, First Publish Date - 2023-04-06T02:56:02+05:30
టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లారు. లీకేజీకి ఆయనే ప్రధాన సూత్రధారి అంటూ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. సంజయ్‌కి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. సంజయ్ దాఖలు చేసిన బెయిల్
కరీంనగర్ జైలుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తరలింపు.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న సంజయ్
చేతికి వాతలు చూపించి న్యాయమూర్తికి ఫిర్యాదు
మెమో ఫైల్ చేసిన సంజయ్ తరఫు లాయర్లు
బెయిల్ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ
పదోతరగతి పేపర్ లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్
పథకం ప్రకారమే పేపర్ లీకేజీకి పాల్పడ్డారు
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారు
రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు
ఏ1గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. 8 సెక్షన్ల కింద కేసు
సంజయ్ బెయిల్ పిటిషన్.. నేడు విచారణ
కోర్టుకు సంజయ్ తరలింపులో రోజంతా హైడ్రామా
కాన్వాయ్‌లో సాయంత్రం వరకు తిప్పుతూ కోర్టుకు
పరామర్శకు వెళ్లిన రఘునందన్, ఈటల అరెస్టు
బీజేపీ శ్రేణుల నిరసనలు.. పలు చోట్ల ఉద్రిక్తతలు
నిరుద్యోగుల కోసం ఎన్నిసార్లయినా జైలుకెళ్తా
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఎన్ని సార్లయినా జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరిని మా పార్టీ ఎండగట్టి తీరుతుంది. మేము వాస్తవాలు మాట్లాడుతుండడంతో బీఆర్‌ఎస్‌లో భయం మొదలైంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాం.
బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీతో సంబంధం ఉందంటూ మంగళవారం రాత్రి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి లీకేజీకి ఆయనే ప్రధాన సూత్రధారి అని ప్రకటించారు. ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు.
సంజయ్ తరలింపులో బుధవారం రోజంతా హైడ్రామా చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీ్‌సస్టేషన్ నుంచి వరంగల్ కోర్టుకు తరలించే క్రమంలో పోలీసులు ఆయన్ను సాయంత్రం దాకా పలు చోట్ల తిప్పారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆందోళనలు చేపట్టాయి. పోటీగా బీఆర్‌ఎస్ శ్రేణులూ నిరసనకు దిగాయి.
బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్టును బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. అమిత్ షా, నడ్డా, తరుణ్ ఛుగ్.. తెలంగాణ నేతలతో మాట్లాడారు.
సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. కాగా, రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు.. బండి సంజయ్‌పై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వరంగల్ లీగల్, ఏప్రిల్ 5: టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లారు. లీకేజీకి ఆయనే ప్రధాన సూత్రధారి అంటూ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. సంజయ్‌కి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం విచారణ జరుపుతామని మెజిస్ట్రేట్ చెప్పడంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం నుంచి హైడ్రామా నడుమ హనుమకొండకు తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల పోటాపోటీ నిరసనల మధ్య పోలీఉలు అతికష్టమ్మీద సంజయ్ కారును కోర్టు భవనం వెనుక గేటు నుంచి లోపలికి తీసుకెళ్లారు. బుధవారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి అయినందువల్ల కోర్టుకు సెలవు కావడంతో కోర్టు ఆవరణలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్లి హాజరుపరిచారు. దీంతో సంజయ్‌కి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి, ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్ 41ఏ నిబంధనల అమలు ఈ కేసులో వర్తించవన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవిస్తూ రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇతర నిందితులు బూర ప్రశాంత్, ల్యాబ్ టెక్నీషియన్ గుండెబోయిన మహేష్, విద్యార్థి మౌతం గణే్‌షను కూడా హాజరుపరిచారు. వీరితోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ పోగు సుభాష్, విద్యార్థులు పోగు శశాంక్, దూలం శ్రీకాంత్, పెరుమాండ్ల శ్రామిక్ పరారీలో ఉన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించారు..
విచారణ సందర్భంగా పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, వివిధ పోలీసుస్టేషన్లకు తిప్పుతూ తీవ్రంగా కొట్టారని సంజయ్ జడ్జికి ఫిర్యాదు చేశారు. తన ఒంటిపై ఉన్న వాతలను చూపించారు. అంతకుముందు సంజయ్ తరపు న్యాయవాదులు వాదనలను వినిపిస్తూ ఆయనపై పోలీసులు పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షపడేవేనని, ఈ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ముద్దాయికి స్టేషన్‌లోనే నోటీసు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అయినా సంజయ్‌ని వేధించేందుకు కావాలనే కోర్టుదాకా తీసుకువచ్చారన్నారు. సెక్షన్ 41ఏ అమలు కోరుతూ మెమోను ఫైల్ చేశారు. సంజయ్‌కి బెయిల్ కోసం వారు పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ వేయడానికి గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దీంతో పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. అనంతరం బుధవారం రాత్రి పోలీసులు సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించారు. బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకోగా వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జైలు వద్దకు తీసుకువస్తున్న క్రమంలో దారి పొడుగునా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. జైలు వద్ద సంజయ్ భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని జైలు అధికారులను కోరగా వారు నిరాకరించారు.
బండి సంజయ్‌పై 8 సెక్షన్ల కింద కేసులు
పదోతరగతి ప్రశ్నా పత్రం లీకేజీ సంఘటనలో బండి సంజయ్‌పై పోలీసులు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 12బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 447 (నేరపూరితంగా చొరబడటం), 505 ఏబి (అనఽధికారికంగా, నేరపూరిత ఆలోచనలతో పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం), సెక్షన్ 4, 6, 8 (మాల్‌ప్రాక్టీస్), 66డి ఐటీ చట్టం (సైబర్ క్రైం) కింద కేసులు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రోజంతా భోజనం చేయని సంజయ్..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసుల చర్యను నిరసిస్తూ సంజయ్ బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ భోజనం చేయలేదు. పోలీసుల వలయంలోనే ఉండిపోయిన ఆయన వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంచినీళ్లు కూడా తీసుకోలేదు. అర్ధరాత్రి రౌడీల్లా వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించారని, తనను ఒక తీవ్రవాదిలా పరిగణించి ఇబ్బంది పెట్టారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా ఈడ్చుకెళ్లారని, పోలీసు అధికారులు చేయిచేసుకున్నారని సంజయ్ హనుమకొండ మేజిస్ట్రేట్ నివాసం వద్ద న్యాయవాదుల బృందానికి వివరించారు. తనకు తగిలిన గాయాలను చొక్కా విప్పి చూపించారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2023-04-06T02:56:02+05:30 IST